కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలపై హైకోర్టు స్టే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో అమలవుతున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకాల అమలుపై స్టే విధించింది. చట్టబద్ధత లేకుండా కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల (జీవోలు) ఆధారంగా పథకాలను అమలు చేస్తున్నారంటూ న్యాయవాది విజయ్‌ గోపాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

చట్టసభల్లో ఎలాంటి తీర్మానం చేయకుండా కేవలం జీవోల ద్వారా పథకాలను అమలు చేయడం చెల్లదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. ఈ పథకాలకు చట్టపరమైన ఆధారం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గత విచారణ సందర్భంగా ఈ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే నాలుగు వారాలు గడిచినా ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో హైకోర్టు పథకాల అమలుపై స్టే విధిస్తూ.. తదుపరి విచారణను సెప్టెంబ‌ర్ 9కి వాయిదా వేసింది.