బావిలో పడి ఆటో డ్రైవర్ మృతి..

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి మండలం రాంపల్లికి చెందిన కన్నం రవి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి సోమవారం మృతి చెందాడు. ఉదయం ఇంటి నుండి వెళ్ళిన రవి తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్ళిన బావి వద్ద పైపులు, మోటారును పరిశీలించే క్రమంలో బావిలో పడి పోయాడు. భార్య ఉపాధి కూలీ పనికి వెళ్లి ఇంటికి రాగా భర్త కనిపించకపోవడంతో పక్కవారికి విషయం తెలిపింది. బంధువులు, గ్రామస్థులు వెతకగా వ్యవసాయ బావిలో రవి మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పెద్దపల్లి పోలీసులు అక్కడికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
