Assessment Booklet | చదువుల జాత‌ర‌..

Assessment Booklet | చదువుల జాత‌ర‌..

  • త్వరలో మెగా పీటీఎం 3.0
  • ఈ నెల 5న అమ్మానాన్నలతో ముఖాముఖి
  • క‌లెక్టర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ‌..

Assessment Booklet | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : స్వర్ణాంధ్ర ల‌క్ష్యాలు, విద్యా రంగ సంస్కర‌ణ‌ల‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం(State Govt).. త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠ‌శాల మ‌ధ్య సంబంధాల‌ను బ‌లోపేతం చేస్తూ విద్యార్థుల స‌మ‌గ్ర వికాసం ల‌క్ష్యంగా మెగా పీటీఎం (తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు) కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంద‌ని, ఇందులో భాగంగా ఈ నెల 5న మెగా పీటీఎం 3.0(PTM 3.0) జ‌ర‌గ‌నుంద‌ని జిల్లా క‌లెక్టర్ డా. జి.ల‌క్ష్మీశ(Collector Dr. G. Lakshmi) తెలిపారు.

మెగా పీటీఎం 3.0 స‌న్నద్ధత‌పై క‌లెక్టర్ ల‌క్ష్మీశ ఈ రోజు క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో ఎంఈవోలు, ఇంట‌ర్మీడియట్(Intermediate) అధికారుల‌తో ప్రత్యక్షంగా పాఠ‌శాల‌ల ప్రధానోపాధ్యాయుల‌తో వ‌ర్చువ‌ల్‌గా స‌మావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్టర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ మెగా పీటీఎం స్ఫూర్తికి అనుగుణంగా కార్యక్రమం నిర్వహ‌ణ‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయాల‌ని, అక‌డ‌మిక్‌గా విద్యార్థుల స‌మ‌గ్ర ప్రగ‌తి నివేదికల (హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు)పై ముఖాముఖి చ‌ర్చించి, భ‌విష్యత్తు కార్యాచ‌ర‌ణ రూపొందించ‌డంపై దృష్టిసారించాల‌న్నారు.

పాఠ‌శాల‌ల్లో ఈ ఏడాది కొత్తగా అసెస్‌మెంట్ బుక్‌లెట్‌(Assessment Booklet)ను ప్రవేశ‌పెట్టార‌ని, ఇందులో పిల్లలు ప‌రీక్షలు ఎలా రాశారు.. వారు సాధించిన పురోగ‌తి, పొందిన ఫ‌లితాలు ఇవ‌న్నీ ప్రోగ్రెస్ కార్డులో ఉంటాయ‌న్నారు. కేవ‌లం మార్కులే కాకుండా పిల్ల‌ల విద్యాభివృద్ధి, శారీర‌క ఆరోగ్యం, సామాజిక నైపుణ్యాలు, భావోద్వేగ స‌మ‌తుల్యత‌, మేధో సామ‌ర్థ్యాలు, సైన్స్ ప్రయోగ సామ‌ర్థ్యాలు వంటివ‌న్నీ న‌మోదై ఉంటాయ‌న్నారు. చిన్నారుల అభ్య‌స‌న ఫ‌లితాలను మెరుగుప‌ర‌చ‌డంలో త‌ల్లిదండ్రులు ఎలాంటి స‌హాయ‌స‌హ‌కారాలు అందించాల‌నే విష‌యంపైనా దిశానిర్దేశం చేయాల్సి ఉంటుంద‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ మార్గద‌ర్శకాల‌కు అనుగుణంగా మెగా పీటీఎం 3.0కు ఏర్పాట్లు చేయాల‌ని.. ప్రజాప్రతినిధులు, త‌ల్లిదండ్రుల‌ను కార్యక్రమానికి ఆహ్వానించాల‌ని క‌లెక్టర్ ల‌క్ష్మీశ అధికారుల‌కు సూచించారు. ముఖ్యంగా ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక దృష్టిపెట్టాల‌న్నారు.

ఉద‌యం 9 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌య్యే కార్యక్రమంలో ద‌శ‌ల‌వారీగా అమ‌లుచేయాల్సిన కార్యక్రమాల‌తో పాటు ముఖాముఖి చ‌ర్చలు, ఎగ్జిబిష‌న్స్‌, త‌ర‌గ‌తి గ‌దుల సంద‌ర్శన, కెరీర్ గైడెన్స్‌(Career Guidance)తో పాటు మ‌నో వికాసానికి సంబంధించిన వీడియోల ప్రద‌ర్శన త‌దిత‌రాల‌కు సంబంధించి క‌లెక్టర్ ల‌క్ష్మీశ అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. స‌మావేశంలో డీఈవో యూవీ సుబ్బారావు, జిల్లా ఇంట‌ర్మీడియట్ విద్యాధికారి బి.ప్రభాక‌ర్‌, స‌మ‌గ్ర శిక్ష ఏపీసీ ఎం.ర‌జ‌నీకుమారి, ఎంఈవోలు తదిత‌రులు పాల్గొన్నారు.