2027 పుష్కరాల నాటికి పోలవరం పూర్తి: నిమ్మల
ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం
ఏలూరు బ్యూరో, (ఆంధ్రప్రభ): 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు పనులను మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నెల రెండో వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించే అవకాశం ఉందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న డయాఫ్రం వాల్ స్థానంలో రూ.990 కోట్లతో 440 రోజుల్లో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించామని, గత ప్రభుత్వం ఐదేళ్లలో 2 శాతం పనులు మాత్రమే పూర్తి చేయగా, కూటమి ప్రభుత్వం రెండేళ్లలో రూ.6,970 కోట్లు వ్యయం చేసి 15 శాతం పనులు పూర్తిచేసిందని వివరించారు. మెయిన్ డ్యామ్ గ్యాప్-1 పనులు 48 శాతం, గ్యాప్-2 పనులు 29 శాతం పూర్తయ్యాయని, ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్, నాలుగు టన్నెల్స్, రహదారి నిర్మాణ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం రెండేళ్లలో రూ.8,323 కోట్ల అడ్వాన్స్ నిధులు విడుదల చేయగా, నిర్వాసితులకు ఇప్పటికే రూ.2,250 కోట్లు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. నిర్వాసితులను త్యాగధనులుగా గుర్తించి గౌరవించింది కూటమి ప్రభుత్వమేనని పేర్కొంటూ, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మరో రూ.200 కోట్ల పరిహారం అందజేయనున్నట్లు వెల్లడించారు. ఇళ్ల నిర్మాణానికి రూ.3.50 లక్షలు, ఇంటి స్థలానికి రూ.2 లక్షల చొప్పున సాయం అందిస్తున్నామని, పునరావాస కాలనీల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. 2027 నాటికి తొలి దశ పునరావాస కార్యక్రమాలను కూడా పూర్తిచేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.
పోలవరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఐకానిక్ బ్రిడ్జిలు, రిసార్టులు, హోటళ్లు, వాటర్ స్పోర్ట్స్ వంటి సదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఏలూరు, రాజమహేంద్రవరం, కొవ్వూరు, జీలుగుమిల్లి జాతీయ రహదారులను పోలవరంతో అనుసంధానం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్, ఎక్స్‌అఫీషియో జాయింట్ కలెక్టర్ వి. అభిషేక్‌తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇంజినీరింగ్ బృందం ప్రతినిధులు పాల్గొన్నారు.
