Artificial Intelligence | కృత్రిమ మేధస్సుపై పెరుగుతున్న ఆందోళనలు

Artificial Intelligence | కృత్రిమ మేధస్సుపై పెరుగుతున్న ఆందోళనలు
Artificial Intelligence | మానవ మేధస్సుకు సవాల్‌గా AI
ఉద్యోగాలపై కృత్రిమ మేధస్సు ప్రభావం
సమాజానికి AI వల్ల కలిగే ప్రమాదాలు
నియంత్రణ లేకుంటే టెక్నాలజీ దుష్పరిణామాలు
Artificial Intelligence | ఒక రాజు గురించి భారతదేశంలో ఒక కథ ఉంది. రాజు తాను బయట నడిచేటప్పుడు కాళ్లు ఎప్పుడూ మురికిగా కాకుండా ఉండేలా ఏదైనా కనిపెట్టమని తన మంత్రులను ఆదేశించాడు. రాజు కోరిక అంటే ఆజ్ఞే కాబట్టి మంత్రులు భయంతో పరిష్కారాల కోసం తలలు పట్టుకున్నారు. వారిలో ఒకరు మొత్తం రాజ్యాన్ని తోలుతో కప్పేయాలని సూచించాడు. అప్పుడు నేల మురికి రాజు పాదాలకు అంటదని అన్నాడు. కానీ అది చాలా ఖరీదైనది, అవాస్తవికమైనది కూడా. భూమంతా కప్పేస్తే పంటలు ఎలా పండుతాయి? చివరికి సరైన పరిష్కారం పాదరక్షల రూపంలో దొరికింది. మనిషి వాటిని వేసుకుంటే కాళ్లు శుభ్రంగా ఉంటాయి.
ఇప్పుడు భారీ భాషా నమూనాల ఆధారంగా నడుస్తున్న కృత్రిమ మేధస్సు వ్యవస్థలను చూస్తే, రాజ్యమంతా తోలుతో కప్పాలన్న ఆలోచనలానే ఇవి కూడా కనిపిస్తున్నాయి. ఒక చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కూడా విపరీతమైన శక్తి, వనరులు వినియోగించబడుతున్నాయి. ఉదాహరణకు “పిల్లులకు ఉత్తమమైన ఆహారం ఏమిటి?” అనే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కూడా కోట్లాది వాక్యాలు, అనేక డేటా కేంద్రాలు, విపరీతమైన గణన శక్తి అవసరమవుతోంది.
పదాల సరళి, భాషా అలవాట్లు, ముందుగా వచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తర్వాత ఏ పదం రావచ్చో అంచనా వేసి సమాధానాలు ఇస్తాయి. అందువల్ల ప్రశ్న ఎలా అడిగామన్నదాని మీద సమాధానం మారుతుంది. కొన్ని సార్లు అవి అర్థంలేని లేదా తప్పు సమాధానాలు కూడా ఇస్తాయి. “చేతి రుమాలు ఏ దుస్తులకు సరిపోతుందో, ఇద్దరు క్రీడాకారుల ప్రదర్శనలో ఎవరు మెరుగో” వంటి చిన్న విషయాల కోసం అపారమైన విద్యుత్‌ను ఖర్చు చేయడం సమంజసమా? అదే విద్యుత్‌ను మరింత అవసరమైన పనులకు వినియోగించవచ్చు కదా? ఇంకా మానవ మేధస్సును, శ్రమను పూర్తిగా భర్తీ చేసే దిశగా ఇవి వెళ్తే సమాజానికి తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఉంది.
ఇప్పటివరకు వచ్చిన ప్రతి కొత్త సాంకేతికత కూడా మొదట్లో కలతలు సృష్టించిందని, తర్వాత కొత్త ఉద్యోగాలు వచ్చాయని సాధారణంగా చెబుతారు. అది కొంతవరకు నిజమే కావచ్చు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండొచ్చు. మనం స్వంతంగా ఆలోచించడం మానేసి ప్రతి చిన్న విషయానికీ యంత్రాల మీద ఆధారపడితే మనం నిజంగా ఏ దిశగా వెళ్తున్నాం?
ఇప్పుడే ఉద్యోగాలను పూర్తిగా తొలగించకపోయినా, భవిష్యత్తులో ఇవి కొత్త ఉద్యోగాల సృష్టిని తగ్గించవచ్చు. ముఖ్యంగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వంటి రంగాల్లో మానవ నైపుణ్యాల అవసరం తగ్గే అవకాశం ఉంది. వయస్సు పెరిగిన ప్రజలు ఇంత వేగంగా మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా మళ్లీ నేర్చుకోవడం అంత సులభం కాదు.
రెండవ విషయం ఏమిటంటే, కృత్రిమ మేధస్సు కార్మికుల పనిని సులభతరం చేస్తుందని చెబుతారు. కానీ అసలు లాభం యజమానులు, పెట్టుబడిదారులకే ఎక్కువగా దక్కుతుంది. ఒక సంస్థ యంత్రాలను ఉపయోగించడం ద్వారా కేవలం ఉత్పాదకతనే కాదు, ఉద్యోగ ఖర్చులను కూడా తగ్గించాలనుకుంటుంది. అంటే కార్మికులను మూలధనంతో భర్తీ చేయడమే. ఈ మార్పు కార్మికుల ప్రయోజనాలను కాపాడకపోతే నిరుద్యోగం, సామాజిక అసంతృప్తి పెరుగుతుంది.
మూడవది, కృత్రిమ మేధస్సు మనుషుల ఆలోచనా శక్తిని క్రమంగా తగ్గించే ప్రమాదం ఉంది. పరిశోధకులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు ప్రతి సమాధానానికీ యంత్రాలనే ఆశ్రయిస్తే స్వతంత్ర ఆలోచన తగ్గిపోతుంది. యంత్రాలు ఇచ్చే సమాధానాల్లో తప్పులు ఉన్నా అవే నిజాలుగా మారిపోతాయి. సుప్రీం కోర్టు ఇటీవల ఒక జూనియర్ జడ్జీని నకిలీ తీర్పులు ఉపయోగించారని తప్పుపట్టింది.
నాలుగవది, కృత్రిమ మేధస్సు నిజమైన విలువ ప్రత్యేక రంగాల్లో మానవ తప్పిదాలను తగ్గించడంలో ఉంది. ఉదాహరణకు న్యాయరంగంలో పాత కేసులను వేగంగా పరిశీలించడంలో ఇది ఉపయోగపడుతుంది. కానీ చివరి నిర్ణయం మాత్రం అనుభవం ఉన్న మనిషిదే కావాలి. అలాగే వైద్యరంగంలో ప్రాథమిక లక్షణాలను విశ్లేషించి వైద్యులకు సహాయం చేయగలదు. గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ వ్యాధులను గుర్తించి అవసరమైనప్పుడు నిపుణుల వద్దకు పంపించడంలో ఇది ఎంతో సహాయపడుతుంది.
ప్రపంచం ఇప్పుడు ఆగి మళ్లీ ఆలోచించాలి. కానీ అందరూ అవకాశాలు కోల్పోతామనే భయంతో పరుగులు తీస్తున్నారు. సాంకేతికత అందుబాటులో ఉందని మాత్రమే దాన్ని ఎలాంటి నియంత్రణ లేకుండా వినియోగించాల్సిన అవసరం లేదు. ఒక సంస్థ కొత్త కృత్రిమ మేధస్సు సాధనాన్ని ప్రవేశపెడితే, ఉద్యోగుల అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఉద్యోగులకు కూడా ఏ భాగాన్ని ఉపయోగించాలో, ఉత్పాదకత లాభాలను ఎలా పంచుకోవాలో అభిప్రాయం చెప్పే హక్కు ఉండాలి. ఉత్పాదకత వల్ల వచ్చే లాభాలను యజమానులు మాత్రమే కాకుండా కార్మికులతో కూడా పంచుకోవాలి. సమాజానికి హానికరమైన వ్యవస్థలను నిరుత్సాహపరచాలి.
ఇది చట్టాల ద్వారా సులభంగా అమలు చేయడం కష్టం. ఎందుకంటే ప్రజాభిప్రాయాన్ని కూడా పెద్ద సంస్థలు ప్రభావితం చేయగలవు. అయినప్పటికీ ప్రజాస్వామ్య సమాజం ఈ విషయంపై ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. సామాజిక నమ్మకాన్ని, మానవ విలువలను దెబ్బతీసే సాంకేతికతను అజాగ్రత్తగా స్వీకరించడం సరైంది కాదు. కానీ ఈ సమయంలో వివేకంతో మాట్లాడుతున్న స్వరాలను నిజంగా ఎవరైనా వింటున్నారా?
— ఆర్. జగన్నాథన్
@The Jaggi
స్వరాజ్య మ్యాగజైన్ మాజీ సంపాదక దర్శకులు
