RIP | వనజీవి రామయ్య ఇకలేరు

హైదరాబాద్ – పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ వన్యప్రాణి సంరక్షకుడు వనజీవి రామయ్య గుండెపోటుతో మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున ఖమ్మంలోని తన స్వగృహంలో గుండెపోటు రావడంతో రామయ్య తుదిశ్వాస విడిచారు. అకస్మాత్తుగా హృదయసంబంధ సమస్యలు తలెత్తగా కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్న మొక్కల ప్రేమికుడు.రామయ్య స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామం. జీవితమంతా మొక్కలు నాటి పెంచారు. కోటికిపైగా మొక్కలు నాటి సరికొత్త చరిత్ర సృష్టించారు. వృక్షో రక్షతి రక్షితః అంటూ నిత్యం ప్రచారంచేసిన ఆయన రోడ్ల పక్కన, పాఠశాలలు, దవాఖానలు, దేవాలయాల్లో మొక్కలు నాటారు. రామయ్య సేవలకుగాను 2017లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. రామయ్యకు భార్య, ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. కాగా ఇద్దరు కుమారులు ఇప్పటికే వివిధ కారణాలతో చనిపోయారు. కాగా, రామయ్య మృతితో ప్రకృతి ప్రేమికులు శోక సంద్రంలో మునిగిపోయారు. రామయ్యను కడసారి చూడటానికి భారీగా తరలి వస్తున్నారు.

జీవితం ..

1937, జూలై 1న దరిపెల్లి లాలయ్య, పుల్లమ్మ దంపతులకు జన్మించారు. ఆయన ఇంటిపేరు దరిపల్లి రామయ్య అయినప్పటికీ వనజీవిగా మార్చుకున్నారు. ఆయనను చెట్ల రామయ్య అనికూడా పిలుస్తారు. 50 ఏండ్లుగా అలుపెరగకుండా విత్తనాలు చల్లుతూ మొక్కలు పెంచేందుకు ప్రయత్నించారు. వేసవిలో విత్తనాలు సేకరించి తొలకరి రాగానే వాటిని ఆయా ప్రాంతాల్లో చల్లుతుండేవారు. ఇలా 120 రకాల మొక్కల చరిత్రను అలవోకగా చెప్పగలరు వనజీవి. మూడు కోట్ల మొక్కలు నాటాలన్నదే తన లక్ష్యమని వనజీవి రామయ్య చెప్తుండేవారు. తెలంగాణ ప్రభుత్వం ఆరో తరగతి సాంఘీకశాస్త్రంలో వనజీవి గురించి పాఠ్యాంశంగా చేర్చింది. అదేవిధంగా మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి తెలుగు విద్యార్థుల కోసం 9వ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవితం పాఠ్యాంశంగా బోధిస్తున్నది.

మనవళ్లకు మొక్కల పేర్లు

రామయ్యకు భార్య జానమ్మ, నలుగురు సంతానం. ఓవైపు కుటుంబ భారాన్ని మోస్తూనే.. నాలుగు దశాబ్దాలకు పైగా మొక్కలు నాటుతూ వచ్చారు. మనుమళ్లు, మనుమరాళ్లకు కూడా యాన చెట్ల పేర్లే పెట్టారు. ఒకామె పేరు చందనపుష్ప, ఇంకో మనుమరాలు హరిత లావణ్య. కుబంధపుష్ప అని ఇంకో పాపకు పెట్టాడు. మరో మనవరాలికి వనశ్రీ అని నామకరణం చేశారు.

అవార్డులు, పురస్కారాలు..

కోటికిపైగా మొక్కలను నాటి ట్రీ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా గుర్తింపు పొందిన రామయ్య సేవలకుగాను పలు సంస్థలు అవార్డులతో సత్కరించాయి. 2005లో సెంటర్‌ఫర్‌ మీడియా సర్వీసెస్‌ సంస్థ నుంచి మనమిత్ర అవార్డులో ఇచ్చింది. యూనివర్సల్‌ గ్లోబల్‌ పీస్‌ అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ప్రధానం చేసింది. 1995లో భారత ప్రభుత్వం నుంచి వనసేవా అవార్డు లభించింది

రామయ్య మృతి పట్ల పలు రంగాలకు చెందిన ప్రముఖులు, పర్యావరణ ప్రేమికులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు

,సీఎం రేవంత్‌ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క , బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ సంతోష్‌ తో సహా పలువురు రాజకీయ నేతలు రామయ్య మృతిపట్ల సంతాపం తెలిపారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *