మనసున్న మారాజు
- మరోసారి మంచి మనసు చాటుకున్న కలెక్టర్
- నలుగురు వికలాంగులకు రూ.2 లక్షల తక్షణ సాయం
- పీజీఆర్ఎస్లో వినతి అందగానే స్పందించిన కలెక్టర్
- పెన్షన్, సదరం సర్టిఫికెట్లకు జారీకి చర్యలు
తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కలెక్టర్ వెంకటేశ్వర్ మారోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ప్రజల సమస్యలను వినడమే కాదు, వారి బాధను అర్థం చేసుకుని వెంటనే ఆదుకోవడం కూడా పరిపాలనలో భాగమని చాటిచెప్పారు. కరకంబాడి సమీపంలోని బీసీ కాలనీలో నివసిస్తున్న ఒక నిరుపేద కుటుంబానికి చెందిన నలుగురు వికలాంగుల పరిస్థితి తెలుసుకుని, వారికి రూ.2 లక్షల తక్షణ ఆర్థిక సహాయం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
వివరాలు.. సోమవారం తిరుపతి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి హాజరైన గంప పరశురామయ్య, గంప మునెమ్మ దంపతుల కుటుంబ సభ్యులు తమ ఆవేదనను జిల్లా కలెక్టర్కు వివరించారు. కుటుంబంలో గంప చంద్రశేఖర్, గంప రాజేశ్వరి, గంప రవి, దేరంగుల వీరభద్రలు మానసిక, శారీరక వికలాంగులుగా బాధపడుతున్నారని, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. వారి ఆవేదన అర్థం చేసుకున్న కలెక్టర్ వెంటనే స్పందించి రూ.2 లక్షల చెక్కును అందజేశారు.
అంతేకాకుండా నలుగురికి పెన్షన్, సదరం సర్టిఫికెట్లు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనుకోని సమయంలో అందిన ఈ సహాయంతో కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. తమ సమస్యను ఓపికగా విని వెంటనే సాయం అందించిన జిల్లా కలెక్టర్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో చోటుచేసుకున్న ఈ ఘటన పలువురిని హత్తుకుంది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, శ్రీ జనతా సేవా మిత్ర హెల్పింగ్ హాండ్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
