ఏపీ ఎంఎస్ఎంఈ ఎక్స్‌పో..

ఏపీ ఎంఎస్ఎంఈ ఎక్స్‌పో..

  • పారిశ్రామికవేత్తలు, విద్యార్థుల కోసం.. విజయవాడ లో నిర్వహణ
  • అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు
  • మార్చి 13–15 వరకు.. ఎస్‌ఎస్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రదర్శన
  • నూతన టెక్నాలజీలు, పరిశ్రమల యంత్రాంగం, బ్యాంకు రుణాలపై అవగాహన

విజయవాడ, ఆంధ్రప్రభ: విజయవాడలో నిర్వహించనున్న ఏపీ ఎంఎస్ఎంఈ ఎక్స్‌పో–2026ను పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, ఔత్సాహిక యువత సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ గౌరవాధ్యక్షుడు బాయన వెంకట్రావు పిలుపునిచ్చారు. గురువారం ఆటోనగర్‌లోని ఎంఎస్ఎంఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 13, 14, 15 తేదీల్లో విజయవాడలోని ఎస్‌ఎస్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ ఎక్స్‌పో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి లక్ష్యంగా వివిధ ఉత్పత్తులు, నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమలకు అవసరమైన యంత్రాంగాన్ని ప్రదర్శనలో ఉంచనున్నట్లు వెల్లడించారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ , ఎమ్మెల్యే గద్దె రామ్ మోహన్ , మాజీ ఎంపీ పల్లె నారాయణ ప్రసాద్ తదితరులు హాజరవుతారని తెలిపారు. ఎక్స్‌పోలో నూతన పరిశ్రమలు ప్రారంభించాలనుకునే వారికి అవసరమైన మార్గదర్శకతను అందించేందుకు కేంద్ర ప్రభుత్వ ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ ప్రతినిధులు, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొని పరిశ్రమల రుణాలు, ఆర్థిక సహాయంపై అవగాహన కల్పిస్తారని వివరించారు. అలాగే ఐసీఐ సి ఐ బ్యాంకు వంటి బ్యాంకుల ప్రతినిధులు కూడా పాల్గొని రుణాల ప్రక్రియపై వివరణ ఇవ్వనున్నట్లు చెప్పారు. విద్యార్థులు, యువ ఆవిష్కర్తలు రూపొందించిన కొత్త ఉత్పత్తులు, ఆవిష్కరణలకు కూడా ఈ ఎక్స్‌పోలో ప్రదర్శన అవకాశాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. రతన్ టాటా ఇన్నోవాషన్ హబ్ ప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొననున్నట్లు వెల్లడించారు.


ఈ సందర్భంగా ఎంఎస్ఎంఈ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.ఎస్. రామచంద్రరావు మాట్లాడుతూ పరిశ్రమల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పారిశ్రామిక అభివృద్ధికి సంస్థ నిరంతరం కృషి చేస్తోందన్నారు. జేఆర్‌డీ టాటా ఐలా ఛైర్మన్ టి. వినోద్ మాట్లాడుతూ ఆటోమొబైల్, వ్యవసాయ రంగాలకు అవసరమైన పరికరాలు ఎక్స్‌పోలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎక్స్‌పోకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో ఎగ్జిబిషన్ కమిటీ చైర్మన్ ఏ.జి. సాంబశివరావు, కమిటీ సభ్యులు మధుమూర్తి, ఎ. నరసింహారావు, టి.వి. నాగేశ్వరరావు, గద్దె సాంబశివరావు, అమర్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు.