ఎడ్ సెట్ కు గణనీయమైన పెరుగుదల

ఎడ్ సెట్ కు గణనీయమైన పెరుగుదల
అమరావతి, ఆంధ్రప్రభ: 2026–27లో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలలో దరఖాస్తుదారుల సంఖ్యలో మిశ్రమ స్పందన కనిపించింది. బీఎడ్ (ఎడ్సెట్)కు దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఏకంగా 38 శాతం పెరుగుదల నమోదైంది. దీంతోపాటు లాసెట్‌కు కూడా ఆదరణ పెరిగింది. మిగతా కామన్ ఎంట్రన్స్ టెస్టులైన పీజీసెట్, ఈసెట్, ఐసెట్‌లకు దరఖాస్తు చేసిన వారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. మిగిలిన అన్ని ప్రవేశ పరీక్షల్లో దరఖాస్తులు తగ్గినా, బీఎడ్ విషయంలో మాత్రం అభ్యర్థుల ఆసక్తి గణనీయంగా పెరిగింది.
2025–26లో 17,795 మంది దరఖాస్తు చేసుకోగా, 2026–27 ప్రవేశాలకు 24,628 మంది పరీక్ష రాయడానికి ముందుకు వచ్చారు. గతేడాది ప్రభుత్వం 16 వేలకుపైగా ఉపాధ్యాయ నియామకాల కోసం ప్రకటన ఇచ్చి, వెంటనే నియామకాలు చేపట్టింది. ఇకపై ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, డీఎస్సీ ద్వారా 3,500 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ పరిణామాలు నిరుద్యోగ అభ్యర్థుల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి. సాధారణ డిగ్రీతోనే ఉపాధ్యాయ ఉద్యోగం సాధించవచ్చనే నమ్మకం పెరిగింది. రానున్న దశాబ్దంలో సుమారు లక్షమంది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందనుండడంతో బీఎడ్‌కు డిమాండ్ పెరిగింది.
పీజీ సెట్లకు తగ్గిన దరఖాస్తులు
పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి ముందుకు వస్తున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. యూనివర్సిటీల్లో పీజీ సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయి. కొన్ని వర్సిటీల్లో సీట్లు పూర్తిగా భర్తీ కావడం లేదు. చివరకు ఓపెన్ అడ్మిషన్లు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థుల కొరత కారణంగా కొన్ని యూనివర్సిటీల్లో జర్నలిజం, తెలుగు, ఇంగ్లిష్ వంటి పీజీ కోర్సులు నిలిపివేశారు. ఈసారి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు 18,008 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీట్ల కంటే దరఖాస్తుల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
ఈఏపీసెట్‌కు స్వల్ప తగ్గుదల
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్‌కు దరఖాస్తుదారుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గతేడాది 3,62,448 మంది దరఖాస్తు చేసుకోగా, ఈసారి 3,55,004 మంది మాత్రమే పరీక్షకు హాజరుకానున్నారు. ఐసెట్ విషయంలో కూడా ఈసారి స్పందన తగ్గింది. గతేడాది 37,572 దరఖాస్తులు రాగా, ఈసారి 26,219 మాత్రమే వచ్చాయి. దాదాపు 30 శాతం తగ్గుదల నమోదైంది. ఈసెట్, పీజీ ఈసెట్, పీఈసెట్‌లకు కూడా దరఖాస్తుల సంఖ్య కొంత మేర తగ్గనుంది.
విద్యార్థుల ఆలోచన మారుతోంది
ఈ మార్పు ఒక్క ఏడాదికే పరిమితం కాకపోవచ్చు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే ఉద్యోగం కోసం ప్రయత్నించే విద్యార్థులు లాంగ్-టర్మ్ కోర్సుల కంటే షార్ట్-టర్మ్ స్కిల్ కోర్సుల వైపు మళ్లుతున్నారు. అలాగే ఉపాధ్యాయ వృత్తి వంటి స్థిరమైన ఉద్యోగాలను ఎంచుకునే ధోరణి పెరుగుతోంది. “విద్యార్థుల ఆలోచనల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది” అని విద్యారంగ నిపుణుడు సీహెచ్ దామోదరరావు తెలిపారు.
