బెట్టింగుల్లో పొగొట్టుకున్న డ‌బ్బుల కోసం…

బెట్టింగుల్లో పొగొట్టుకున్న డ‌బ్బుల కోసం…

కరీంనగర్‌ క్రైం, ఆంధ్ర‌ప్ర‌భ : ఆన్‌లైన్‌ బెట్టింగులు ఆడి అప్పులపాలైన ఓ యువకుడు దొంగగా మారి చివరకు కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్(Karimnagar Rural Police Station) పరిధిలో చోటు చేసుకుంది. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఈ రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయకుమార్, సీఐ నిరంజన్ రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు.

కరీంనగర్ తీగలగుట్టపల్లిలోని రెవెన్యూ కాలనీకి చెందిన మహమ్మద్ ముస్తాక్(Mohammed Mushtaq) కోదాడ దగ్గరలోని మేళ్లచెరువు వద్ద బాయిలర్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. ఆన్‌లైన్‌ బెట్టింగ్ గేమ్ డాష్ రమ్మీకి అలవాటుపడి అప్పులపాలయ్యాడు. అప్పులు తీర్చడానికి డబ్బుల కోసం తాళం వేసిన ఇళ్లను గమనించి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఫిబ్రవరి,జూన్ నెలలలో అదే రెవెన్యూ కాలనీలోని ఒకే ఇంట్లో రెండుసార్లు దొంగతనం చేసి రూ.12 లక్షల విలువ గల బంగారాన్ని దోచుకున్నాడు.

కేసు నమోదు చేసుకున్న కరీంనగర్ రూరల్ పోలీసులు దొంగతనాలపై దృష్టి పెట్టారు. ఈ రోజు పోలీసు తనిఖీల్లో(during police checks) మహమ్మద్ ముస్తాక్ ను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించటంతో విషయాలు బయటకు వచ్చాయి. నిందితుడి నుంచి 91 గ్రాముల బంగారం ( సుమారు రూ.12 లక్షలు) స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు.

నిందితున్ని పట్టుకోవడంలో కృషి చేసిన సీఐ ఏ.నిరంజన్ రెడ్డి(CI A. Niranjan Reddy), సీపీఎస్‌, సీఐ ప్రకాష్ గౌడ్, ఎస్సై లక్ష్మారెడ్డి, సీసీఎస్ హెచ్ సీ ఎండి హసనోద్దీన్, పీసీ ఎన్.శేఖర్, పీసీ ఎండి ఖలీఫా, రూరల్ హెచ్‌సీ శ్రీరాములు, పీసీ సల్మాన్ లను సీపీ గౌష్ ఆలం, ఏసీపీ విజయ్ కుమార్ అభినందించి రివార్డులు అందజేశారు.

Leave a Reply