ఆంధ్ర విశ్వవిద్యాలయం @100

ఆంధ్ర విశ్వవిద్యాలయం @100
విశాఖపట్నం, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా పేరుగాంచిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆదివారంతో వందేళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలో పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వర్సిటీ తొలి వైస్ చాన్సలర్ సి.ఆర్. రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం, ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. 1926లో ప్రారంభమైన ఆంధ్ర విశ్వకళాపరిషత్ శతాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు వర్సిటీ వర్గాలు భారీ ఏర్పాట్లు చేశాయి. 1926–2026 శతాబ్ది సందర్భంగా ఇప్పటికే ఏడాది కాలంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఏయూ @ 100 – వైభవంగా శతాబ్ది ఉత్సవాలు
శతాబ్ది ముగింపు ఉత్సవాలను సోమవారం సాయంత్రం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించేందుకు వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌తో పాటు పలువురు పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, పూర్వ విద్యార్థులు, ప్రముఖులు, క్రీడాకారులు హాజరుకానున్నారు.
శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడానికి ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి, గవర్నర్ సోమవారం మధ్యాహ్నం విశాఖకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఏయూ విజయాలను గుర్తు చేస్తూ ప్రత్యేక నాణెం విడుదల, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పలు వరాలు ప్రకటించే అవకాశం ఉందని వర్సిటీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఒక రాష్ట్రం పేరుతో ఈ విశ్వకళాపరిషత్ వందేళ్లు పూర్తి చేసుకోవడం తెలుగువారికి అత్యంత గర్వకారణంగా భావిస్తున్నారు. అందువల్లే ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించారు.
ముగింపు వేడుకలకు భారీ స్పందన
ముగింపు వేడుకలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. సుమారు 25 వేల మంది పాల్గొంటారని అంచనా. కేంద్రం ఏయూను హెరిటేజ్ వర్సిటీగా గుర్తిస్తే భారీ నిధులు లభించే అవకాశం ఉంది.
28న గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గూగుల్ డేటా సెంటర్‌కు మంగళవారం భూమిపూజ జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొని, రాత్రికి పోర్టు అతిథి గృహంలో బస చేస్తారు. మంగళవారం ఉదయం నేవల్ కోస్టల్ బ్యాటరీ నుంచి హెలికాప్టర్ ద్వారా తర్లువాడకు చేరుకుని గూగుల్ ప్రతినిధులతో కలిసి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను విశాఖ జిల్లా కలెక్టర్ అభిషేక్ కిశోర్ పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు రైతులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
