పేదరికం నిర్మూలనకు పీ4 ఒక వినూత్న కార్యక్రమం

పేదరికం నిర్మూలనకు పీ4 ఒక వినూత్న కార్యక్రమం
- జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ:
సమాజంలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించాలనే గొప్ప లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతకు అనుగుణంగా ప్రభుత్వం ప్రారంభించిన పీ4 (పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ పార్ట్‌నర్‌షిప్) కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా ముందుకుసాగుతోంది. గతేడాది రాష్ట్రంలోనే తొలిసారిగా నందిగామ నియోజకవర్గ పరిధిలోని ముప్పాళ్ల గ్రామంలో బంగారు కుటుంబాలకు మార్గదర్శుల ద్వారా సహాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కేవలం ఆర్థిక సహాయం అందించి ఊరుకోవడమే కాకుండా, ఒక పేద కుటుంబాన్ని పేదరికం నుండి పూర్తిగా బయటపడే వరకు, వారు ఆర్థికంగా నిలదొక్కుకుని సమాజంలో సగర్వంగా నిలబడేలా మార్గదర్శులు నిరంతరం తోడ్పాటునందిస్తున్నారు.
ఈ క్రమంలోనే ‘సెంటిని బయో ప్రొడక్ట్స్’ సంస్థ మార్గదర్శకత్వంలో ముప్పాళ్లకు చెందిన కొండ్రు వెంకటరావమ్మ బంగారు కుటుంబానికి ఇప్పటికే ఒక ఆటో, కుట్టుమిషన్ అందించడంతో పాటు వారి పిల్లల చదువుకు అవసరమైన పూర్తి ఆసరాను కల్పించారు. దీనికి తోడుగా, సదరు కుటుంబానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు సెంటిని బయో ప్రొడక్ట్స్ సంస్థ రూ. 3 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.
గురువారం విజయవాడలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ చేతుల మీదుగా ఈ ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును లబ్ధిదారు కొండ్రు వెంకటరావమ్మ కుటుంబ సభ్యులకు ఘనంగా అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. లబ్ధిదారులైన బంగారు కుటుంబాలను దాతలైన మార్గదర్శకులతో అనుసంధానించి, వారు సమాజంలో ఉన్నతంగా ఎదిగే వరకు పర్యవేక్షించడం అభినందనీయమన్నారు. పీ4 అనేది ఒక వినూత్న కార్యక్రమమని, రాష్ట్రంలోనే కాకుండా దేశంలో, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని అమలు చేస్తోందని కలెక్టర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో సెంటిని బయో ప్రొడక్ట్స్ సంస్థ యాజమాన్య ప్రతినిధి కె. శ్రీవల్లి, జనరల్ మేనేజర్ కె. మనోజ్ కుమార్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
