కదిరిలో పోలీసుల ఆధ్వర్యంలో భారీ క్రికెట్ టోర్నమెంట్

కదిరిలో పోలీసుల ఆధ్వర్యంలో భారీ క్రికెట్ టోర్నమెంట్

యువతలో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ పెంపొందించడమే లక్ష్యం
విజేతలకు నగదు బహుమతులు
ఫైనల్ రోజున డాక్టర్లు Vs పోలీసుల ఫ్రెండ్లీ మ్యాచ్

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్య సాయి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కదిరి నియోజకవర్గ యువత కోసం ప్రత్యేక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు పోలీసులు ప్రకటించారు. యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించడం, ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని ప్రోత్సహించడం, అలాగే యువతను సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ , అడిషనల్ ఎస్పీ కదిరి డీఎస్పీ జె. శివ నారాయణ స్వామి పర్యవేక్షణలో ఈ పోటీలు జరగనున్నాయి.

కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ క్రికెట్ టోర్నమెంట్ నాకౌట్ పద్ధతిలో నిర్వహించబడనుంది. టోర్నమెంట్‌లో రెడ్ టెన్నిస్ బాల్‌ను ఉపయోగించనుండగా, ప్రతి మ్యాచ్‌కు అవసరమైన టెన్నిస్ బాల్‌ను నిర్వాహకులే ఉచితంగా అందించనున్నారు. ప్రతి ఇన్నింగ్స్‌కు నాలుగు ఓవర్లు ఉండే విధంగా మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. మొత్తం మ్యాచ్‌లు 12 ఓవర్ల పరిమితితో జరుగుతాయి. అయితే ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యేకంగా 14 ఓవర్లతో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. రోజుకు మూడు మ్యాచ్‌లు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.

కదిరి నియోజకవర్గ పరిధిలోని యువకులు, క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు పిలుపునిచ్చారు. టోర్నమెంట్‌లో పాల్గొనదలచిన జట్లు తమ పేర్లు, జట్టు వివరాలను ఈ నెల 23వ తేదీ శనివారం సాయంత్రం లోపు సంబంధిత పోలీస్ స్టేషన్లలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ పోటీలకు ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదని స్పష్టం చేశారు. యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో పూర్తిగా ఉచితంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పోటీల్లో విజేతగా నిలిచిన జట్టుకు రూ.25 వేల నగదు బహుమతి అందజేయనుండగా, రన్నరప్ జట్టుకు రూ.15 వేల నగదు బహుమతి ప్రదానం చేయనున్నారు. అదేవిధంగా ప్రతి మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాడికి “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” పేరిట రూ.1,000 నగదు బహుమతి అందించనున్నారు. టోర్నమెంట్ మొత్తంలో విశేష ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు “మ్యాన్ ఆఫ్ ది సిరీస్”, “బెస్ట్ బ్యాట్స్‌మన్”, “బెస్ట్ బౌలర్” అవార్డులతో పాటు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు కూడా అందజేయనున్నారు. ఈ బహుమతులను జిల్లా ఎస్పీ స్వయంగా అందజేయనున్నట్లు సమాచారం.

పోటీల నిర్వహణలో అంపైర్‌దే తుది నిర్ణయమని నిర్వాహకులు స్పష్టం చేశారు. అలాగే ఒక జట్టులో ఆడిన ఆటగాడు మరో జట్టులో పాల్గొనరాదని నిబంధనలు విధించారు. ప్రతి జట్టు తమ క్రికెట్ కిట్లను తామే తీసుకురావాలని సూచించారు. క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని యువతకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఈ నెల 31వ తేదీన ఫైనల్ మ్యాచ్ నిర్వహించనుండగా, అదే రోజు ప్రముఖ వైద్యుల జట్టు పోలీస్ జట్టు మధ్య ప్రత్యేక ఫ్రెండ్లీ మ్యాచ్ కూడా నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు. క్రీడల ద్వారా యువతను మంచి మార్గంలో నడిపించడమే కాకుండా, ప్రజలకు, పోలీసులకు మధ్య సాన్నిహిత్యాన్ని పెంపొందించడమే ఈ టోర్నమెంట్ ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply