రైతన్న జర జాగ్రత్త !
- ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వ్యవసాయ రంగంలో వానాకాలం (ఖరీఫ్ సీజన్) అత్యంత కీలకమైన సమయం. కొత్త పంట వేసేందుకు రైతన్నలు పొలాలు దుక్కి దున్నడం, నాట్లు వేయడం, మోటార్లు నడపడం, ఎరువులు చల్లడం వంటి పనుల కోసం రోజంతా పొలాల్లోనే గడపాల్సి వస్తుంది. అయితే ఇదే సమయంలో ప్రతి ఏడాది విద్యుత్ ప్రమాదాల కారణంగా పలువురు రైతులు ప్రాణాలు కోల్పోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
కొద్దిపాటి నిర్లక్ష్యం, చిన్న పొరపాటే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కొద్దిపాటి అప్రమత్తత, ముందు జాగ్రత్తలు పాటించడం ద్వారా ఇలాంటి ప్రాణాంతక ప్రమాదాల నుంచి రైతన్నలు తమ ప్రాణాలను కాపాడుకోవచ్చు.
వర్షం కురుస్తున్న సమయంలో లేదా ఉరుములు, మెరుపులు వస్తున్న సమయంలో హైటెన్షన్ విద్యుత్ లైన్లు, విద్యుత్ స్తంభాల కింద ఎట్టిపరిస్థితుల్లోనూ నిలబడకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాతావరణం తేమగా ఉన్నప్పుడు విద్యుత్ లీకేజీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వైర్ల కింద నిలబడటం వల్ల అవి నేరుగా (డైరెక్ట్) కరెంట్ షాక్‌కు గురిచేసి… ప్రాణాలకే ముప్పు తెస్తాయి.
వాన పడుతున్నప్పుడు లేదా పొలం తడిగా ఉన్నప్పుడు చేతులతో ఇనుప వస్తువులను పట్టుకోవడం చాలా ప్రమాదకరం. ఇనుము విద్యుత్ వాహకం (Conductor) కావడం వల్ల, పరిసరాల్లో ఎక్కడైనా విద్యుత్ లీకేజీ ఉంటే అది సులభంగా మనకు కరెంట్ షాక్ తగిలేలా చేస్తుంది. చాలామంది రైతులు వాన నుంచి రక్షణ కోసం ఇనుప రాడ్ లేదా ఐరన్ ఎండ్ (Iron end) ఉన్న గొడుగులను వాడుతుంటారు. వర్షం పడుతున్నప్పుడు ఇలాంటి గొడుగులు పట్టుకుని తిరగడం వల్ల, పొలంలో ఉన్న డిస్కంల లైన్ల నుండి విద్యుత్ ప్రవాహం నేరుగా మనల్ని తాకే ప్రమాదం ఉంది. అందుకే వానాకాలంలో వీలైనంత వరకు ప్లాస్టిక్ లేదా పీవీసీ (PVC) హ్యాండిల్స్ ఉన్న గొడుగులను లేదా రెయిన్ కోట్లను మాత్రమే ఉపయోగించాలి.
పొలాల్లో ఉండే ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల స్టే వైర్లను (సపోర్ట్ వైర్లు) ఎట్టిపరిస్థితుల్లోనూ తాకవద్దు. బావి లేదా బోరు వద్ద మోటార్ ఆన్ చేసేటప్పుడు చేతులు తడిగా లేకుండా చూసుకోవాలి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉండేందుకు ఎల్లప్పుడూ నాణ్యమైన స్టార్టర్ బాక్స్‌లను మాత్రమే ఉపయోగించాలి. పొలంలో ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడినా, లేదా విద్యుత్ స్తంభాలు వంగిపోయినా రైతులు సొంతంగా ఎలాంటి ప్రయోగాలు చేయకూడదు. ప్రమాదకర పరిస్థితులను గమనించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి ప్రాణాపాయం కలగకుండా చూసుకోవాలి.
పొలం పనుల్లో తెలిసిన చిన్న చిన్న జాగ్రత్తలను నిర్లక్ష్యం చేయడం వల్లే చాలాసార్లు పెద్ద ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రైతే రాజు అని గౌరవించే మన సమాజంలో.. అన్నదాత భద్రత కూడా అంతే ముఖ్యమైనది. దేశానికి అన్నం పెట్టే రైతన్న తన ప్రాణాల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తతే ప్రాణ రక్షణ.. భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించి క్షేమంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
