డీసీఈబీ సెక్రటరీగా పానుగోతు చత్రు నాయక్ బాధ్యతల స్వీకారం
గరిడేపల్లి (ఆంధ్రప్రభ): సూర్యాపేట జిల్లా డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు (డీసీఈబీ) నూతన సెక్రటరీగా జిల్లాలో సీనియర్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి పానుగోతు చత్రు నాయక్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా విద్యాశాఖాధికారి కే. అశోక్ తన కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలను అప్పగించారు.
ఈ సందర్భంగా డీఈఓ కే. అశోక్ మాట్లాడుతూ, విద్యాశాఖలో సుదీర్ఘ అనుభవం కలిగిన చత్రు నాయక్ ఆధ్వర్యంలో జిల్లాలో పరీక్షల నిర్వహణ, విద్యా ప్రమాణాల మెరుగుదల మరింత సమర్థవంతంగా సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డీసీఈబీ సభ్యులు, డీఈఓ కార్యాలయ సిబ్బంది, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు నూతన సెక్రటరీని పుష్పగుచ్ఛాలతో అభినందించారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం పానుగోతు చత్రు నాయక్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో జిల్లాలో విద్యావ్యవస్థ బలోపేతానికి, పరీక్షల పారదర్శక నిర్వహణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు.
