పిల్లలకు ఓట్లు లేకపోయినా.. వారి భవిష్యత్తు ముఖ్యం..

  • నాచారంలో భారీ బాలామృతం ప్లాంట్ ప్రారంభం..
  • చిన్నారులకు మరింత నాణ్యమైన పౌష్టికాహారం
  • 20 ఎకరాల్లో బాలామృతం తయారీ కేంద్రం..
  • గర్భిణీలు, చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం

ఆంధ్రప్రభ, హైదరాబాద్ : తెలంగాణ సమాజ అభివృద్ధిలో మహిళలు, చిన్నారుల పాత్రే అత్యంత కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని నాచారంలో ‘తెలంగాణ ఫుడ్ ఇండస్ట్రీస్’ ఆవరణలో ఏకంగా 20 ఎకరాల భారీ విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో నూతనంగా నిర్మించిన ‘బాలామృతం’ ఉత్పత్తి ప్లాంట్‌ను ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లాంట్ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి మొక్కను నాటారు.

ప్రైవేట్ కాంట్రాక్టులు రద్దు..

ఇప్పటివరకు అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే బాలామృతం తయారీని బయటి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించేవారు. అయితే, పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా పౌష్టికాహారాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రైవేట్ కాంట్రాక్టులను రద్దు చేసి, ప్రభుత్వమే నేరుగా తయారు చేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది.

ప్లాంట్ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గర్భిణీల నుంచి పిల్లలకు ఆరేళ్లు వచ్చే వరకు అత్యంత నాణ్యమైన పౌష్టికాహారాన్ని (న్యూట్రీషన్ ఫుడ్) అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్) వరకు చదివే విద్యార్థులందరికీ ఉచితంగా బ్రేక్‌ఫాస్ట్ (అల్పాహారం), లంచ్ (మధ్యాహ్న భోజనం) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పాఠశాలల్లో అందించే ఈ భోజన నాణ్యతను నిరంతరం పరిశీలించేందుకు.. ప్రభుత్వ స్కూళ్లలోనే టీచర్లు కూడా విద్యార్థులతో పాటే బ్రేక్‌ఫాస్ట్, లంచ్ చేయాలని సీఎం నిర్ణయించారు. “పిల్లలకు ఓట్లు లేకపోయినా.. వారి భవిష్యత్ పట్ల తమ ప్రభుత్వానికి పూర్తి శ్రద్ధ ఉంది” అని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా భావోద్వేగంగా పేర్కొన్నారు.

మహిళలకు అండగా ప్రభుత్వం..

మహిళా సంక్షేమం, సాధికారతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలను ఆయన ఈ వేదికపై ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అధికారంలోకి వచ్చిన కేవలం 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించామని, దీనివల్ల పనిచేసే మహిళలకు నెలకు కనీసం రూ. 10,000 వరకు ఆర్థికంగా ఆదా అవుతోందని సీఎం తెలిపారు.

నిరుపేదలకు నిర్మించి ఇచ్చే ‘ఇందిరమ్మ ఇళ్లను’ కుటుంబంలోని మహిళల పేర్లపైనే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం.. త్వరలోనే హైదరాబాద్ సిటీలో లక్ష ఇందిరమ్మ ఇళ్లు కట్టి పేదలకు పంచుతామని భరోసా ఇచ్చారు. గృహ జ్యోతి పథకం కింద అర్హులైన కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని, అలాగే పేదలకు ఉచితంగా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని వివరించారు. రాబోయే 2034 నాటికి రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ తుది లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇక నేడు ప్రారంభించిన అత్యాధునిక బాలామృతం’ ఉత్పత్తి ప్లాంట్…. చిన్నారులకు పౌష్టికాహార లోపం లేకుండా చేసేందుకు ఎంతగానో దోహదపడుతుందని, ఇకపై మరింత నాణ్యమైన బాలామృతాన్ని సకాలంలో అంగన్‌వాడీ కేంద్రాలకు చేరవేస్తామని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.