రైలు బోగీలో నిర్లక్ష్యం.. ప్రయాణికులు ప్రాణాలకు ముప్పుగా…

రైలు బోగీలో నిర్లక్ష్యం.. ప్రయాణికులు ప్రాణాలకు ముప్పుగా…
- ధూమపానం.. ప్రమాదకర పదార్థాల రవాణాపై రైల్వే ఉక్కుపాదం
- ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడితే కఠిన చర్యలు
- విజయవాడ డివిజన్‌లో ఆర్‌పీఎఫ్ ప్రత్యేక దాడులు.. వేల కేసులు నమోదు
- రైలులో గ్యాస్ సిలిండర్‌తో మహిళ పట్టివేత
- ధూమపానం కారణంగా రైలుబోగీలో అగ్నిప్రమాదం ఘటన
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో:
రైళ్లలో ధూమపానం చేయడం, పేలుడు ప్రమాదకర పదార్థాలను తీసుకెళ్లడం ప్రయాణికుల భద్రతకు పెను ముప్పుగా మారుతోందని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ హెచ్చరించింది. రైల్వే ఆస్తులు, ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదంగా మారుతున్న ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) విస్తృత స్థాయిలో తనిఖీలు, ప్రత్యేక దాడులు నిర్వహిస్తోంది. రైల్వే చట్టం ద్వారా కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఏసీ కోచ్‌లు, స్లీపర్ బోగీలు, జనరల్ కంపార్ట్‌మెంట్లు, టాయిలెట్లు, వెస్టిబ్యూల్స్, ప్లాట్‌ఫార్మ్‌లలో ప్రయాణికులు ధూమపానం చేయడం కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. చిన్న నిర్లక్ష్యమే భారీ అగ్నిప్రమాదాలకు దారి తీసే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్య ఘటనలు..
ఇటీవల మే 21న గుంటూరు జిల్లా చంద్రాజుపాలెం గ్రామానికి చెందిన గాలం ధనలక్ష్మి అనే మహిళ 15.4 కిలోల గ్యాస్ సిలిండర్‌తో రైలులో ప్రయాణిస్తూ ఆర్‌పీఎఫ్‌కు పట్టుబడ్డారు. రైలులో ఇలాంటి మండే పదార్థాలను తీసుకెళ్లడం నిషేధమని అధికారులు వివరించగా, ఆమె తప్పును అంగీకరించినట్లు వెల్లడించారు. గ్యాస్ సిలిండర్‌ను స్వాధీనం చేసుకుని చీరాల ఆర్‌పీఎఫ్ స్టేషన్‌లో క్రైమ్ కేసు నమోదు చేశారు.
ఈ ఏడాది జనవరి 9న తుని వద్ద 17479 రైలులోని బీ-5 కోచ్‌లో ధూమపానం కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ కేసులో బెడ్‌రోల్ అటెండెంట్‌గా పనిచేస్తున్న 31 ఏళ్ల మొహమ్మద్ అక్బర్ ఆలంను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ధూమపానం ఎంతటి ప్రమాదాలకు దారితీస్తుందో స్పష్టంచేస్తోందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
కేసుల వివరాలు..
2025 సంవత్సరంలో ధూమపానం కేసులపై రైల్వే చట్టం సెక్షన్ 167 కింద మొత్తం 403 కేసులు నమోదు చేయగా, అందులో 330 కేసుల్లో శిక్షలు విధించి రూ.32,900 జరిమానా వసూలు చేశారు. మిగిలిన కేసులు విచారణలో ఉన్నాయని వెల్లడించారు.
2026లో తనిఖీలను మరింత ముమ్మరం చేసిన ఆర్‌పీఎఫ్, మే 21 నాటికి ఏకంగా 1186 కేసులు నమోదు చేసి అంతమంది నిందితులను పట్టుకున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు 187 కేసుల్లో శిక్షలు ఖరారు చేసి రూ.18,900 జరిమానా వసూలు చేసినట్లు పేర్కొంది.
రైలులో ధూమపానం చేయడం రైల్వే చట్టంలోని సెక్షన్ 167 ప్రకారం శిక్షార్హమైన నేరమని, మండే పదార్థాలను తీసుకెళ్లడం సెక్షన్ 164 కింద తీవ్రమైన నేరమని రైల్వే శాఖ మరోసారి స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.
ప్రయాణికులు రైళ్లలో, స్టేషన్ పరిసరాల్లో ధూమపానం చేయకూడదని, గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్, ఇతర మండే పదార్థాలను తీసుకెళ్లరాదని సూచించింది. ఎక్కడైనా ఇలాంటి ఘటనలు గమనిస్తే వెంటనే రైల్వే సిబ్బంది లేదా ఆర్‌పీఎఫ్‌కు సమాచారం అందించాలని కోరింది. సురక్షితమైన, అగ్నిప్రమాద రహిత ప్రయాణ వాతావరణం కోసం ప్రయాణికులంతా సహకరించాలని విజయవాడ డివిజన్ ఆర్‌పీఎఫ్ విజ్ఞప్తి చేసింది.
