భక్తులకు ఆధునిక సౌకర్యాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం

భక్తులకు ఆధునిక సౌకర్యాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం

  • మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో:
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గురువారం చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. స్థానిక ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులతో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రికి వేదాశీర్వచనం అందించారు.

ఈ పర్యటనలో భాగంగా భక్తుల సేవార్థం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.14.74 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన “వినాయకసదన్ అకామిడేషన్ బిల్డింగ్”ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్థానిక శాసనసభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ నూతన వసతి గృహ సముదాయంలో మొత్తం 108 గదులను ఆధునిక సౌకర్యాలతో భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. భక్తులకు మరింత సౌకర్యవంతమైన వసతి కల్పించేందుకు రూ.2.10 కోట్ల వ్యయంతో అత్యాధునిక ఫర్నిచర్, టేక్‌వుడ్ పడకలు, సోఫాలు, డైనింగ్ టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి గదిలో స్వామివారి ఫోటోను ఉంచి ఆధ్యాత్మిక వాతావరణం కల్పించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాణిపాకం ఆలయానికి రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో, వారికి పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వసతి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఆలయ పరిసరాల్లో పార్కింగ్, తాగునీరు, విశ్రాంతి కేంద్రాలు, క్యూలైన్లు వంటి మౌలిక సదుపాయాలను మరింత విస్తరించనున్నట్లు వెల్లడించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి.. రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ద్వారా ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 52 ఆలయాలలో అన్నప్రసాద వితరణ జరుగుతుండగా, భవిష్యత్తులో ఈ పథకాన్ని 116 ఆలయాలకు విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో త్వరలో గోదావరి, కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పురాతన దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

చిత్తూరు జిల్లాలోని అర్ధగిరి, మొగిలి ఆలయాలను ప్రముఖ టూరిస్ట్ హబ్‌లుగా మారుస్తామని, అలాగే అరగొండ చౌడేశ్వరాలయం అభివృద్ధికి అపోలో దాతల సహకారంతో పాటు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే పనులు ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. వీటితో పాటు రాష్ట్రంలోని వివిధ ఆలయాలలో ఖాళీగా ఉన్న 106 ఈవో పోస్టులను ఏపీపీఎస్సీ (APPSC) ద్వారా భర్తీ చేయడానికి చర్యలు చేపట్టామని, ఆలయ ఉద్యోగుల వేతనాల పెంపుపై ప్రభుత్వం త్వరలో సానుకూల నిర్ణయం తీసుకోనుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో చిత్తూరు శాసనసభ్యులు జగన్మోహన్ రాజు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఆలయ ఈవో గురుప్రసాద్, దేవస్థానం పాలకమండలి సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply