Chicken Prices | కొండెక్కిన చికెన్ ధర..

-కోడి గుడ్లు, బిర్యానీ కూడా భారమే!
-గత నెలతో పోలిస్తే కిలోకు రూ.40-50 వరకు పెరిగిన చికెన్ ధరలు..
-గుడ్డు రూ.8కు చేరిక..
-హోటళ్లలో బిర్యానీ, చికెన్ కర్రీ ధరలూ పెంపు..

Chicken Prices | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో సామాన్యులపై భారం రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పుడు చికెన్, కోడిగుడ్ల ధరలు కూడా భారీగా పెరగడంతో మాంసాహార ప్రియులు కొనుగోళ్లను తగ్గించుకుంటున్నారు. పెరిగిన ముడి సరుకు వ్యయాల ప్రభావంతో హోటళ్లు, మెస్‌ల్లోనూ చికెన్ వంటకాల ధరలు పెరిగాయి.

చికెన్ ధరలు గత నెలతో పోలిస్తే కిలోకు రూ.40 నుంచి రూ.50 వరకు పెరిగాయి. ప్రస్తుతం స్కిన్‌తో కూడిన బ్రాయిలర్ చికెన్ కిలో రూ.290కు విక్రయిస్తుండగా, స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.320 పలుకుతోంది. బోన్‌లెస్ చికెన్ ధర కిలోకు రూ.380 నుంచి రూ.400 వరకు చేరింది. దీంతో వారానికి ఒకసారి చికెన్ కొనుగోలు చేసే కుటుంబాలు ఇప్పుడు నెలకు ఒకసారి మాత్రమే కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు.

ఇదే సమయంలో కోడిగుడ్ల ధరలు కూడా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. హోల్‌సేల్ మార్కెట్‌లో ఒక్క గుడ్డు రూ.7.50 ఉండగా, రిటైల్‌లో రూ.8 వరకు విక్రయిస్తున్నారు. దీంతో పది గుడ్ల ధర రూ.80 దాటింది. వేసవి ప్రభావంతో కోళ్ల ఉత్పత్తి తగ్గడం, కోళ్ల దాణా ధరలు పెరగడం వల్లే గుడ్ల ధరలు పెరిగాయని పౌల్ట్రీ వ్యాపారులు పేర్కొంటున్నారు. చికెన్, గుడ్ల ధరల పెరుగుదల ప్రభావం హోటల్ రంగంపైనా పడింది. చికెన్ బిర్యానీ ప్లేట్‌పై రూ.20 వరకు, చికెన్ కర్రీ మీల్‌పై రూ.15 వరకు ధరలు పెంచినట్లు హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. గుడ్డు కర్రీ ధరను కూడా రూ.5 నుంచి రూ.10 వరకు పెంచాల్సి వచ్చిందని వెల్లడిస్తున్నారు.

ధరల పెరుగుదల కారణంగా చికెన్ కొనుగోళ్లు గణనీయంగా తగ్గినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గతంతో పోలిస్తే అమ్మకాలు సుమారు 30 శాతం వరకు పడిపోయాయని వ్యాపారులు వెల్లడిస్తున్నారు. అయితే కోళ్ల దాణా, మందులు, రవాణా ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ధరలను తగ్గించడం ప్రస్తుతం సాధ్యం కాదని పౌల్ట్రీ ఫారం యజమానులు అంటున్నారు. మరోవైపు పెళ్లిళ్లు, శుభకార్యాల్లో చికెన్ వంటకాల వినియోగం కొనసాగుతున్నప్పటికీ, పెరిగిన ధరల కారణంగా నిర్వాహకులు మెనూలో కోత విధిస్తున్నట్లు సమాచారం. మార్కెట్ పరిస్థితులు చూస్తే మరో నెల రోజుల పాటు చికెన్, గుడ్ల ధరలు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశముందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.