మూడు రోజులుగా వృథాగా పారుతున్న తాగునీరు..
- స్పందించని అధికారులు
క్యాతనపల్లి, ఆంధ్రప్రభ: బి-జోన్ రాజీవ్ చౌక్ వద్ద గత మూడు రోజులుగా తాగునీరు పైప్లైన్ లీకేజీ కారణంగా రోడ్డుపై వరదలా పారుతోంది. దీనిపై సింగరేణి సివిల్ విభాగం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికుల కథనం ప్రకారం, గతంలో కూడా ఇదే ప్రాంతంలో రెండుసార్లు పైప్లైన్ లీకేజీ ఏర్పడింది. అప్పట్లో మరమ్మతులు చేసినప్పటికీ నాణ్యత లోపం కారణంగా మళ్లీ అదే సమస్య పునరావృతమవుతోందని తెలిపారు. ప్రస్తుతం కూడా భారీగా తాగునీరు వృథా అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ఒకవైపు తాగునీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు వేల లీటర్ల నీరు వృథా కావడం బాధాకరమని పేర్కొన్నారు. పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా ఈ సమస్యపై స్పందించకపోవడం గమనార్హమని అన్నారు.
పైప్లైన్కు వెంటనే మరమ్మతులు చేపట్టి, తాగునీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు సింగరేణి అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
