భద్రతపై ప్రత్యేక దృష్టి..

భద్రతపై ప్రత్యేక దృష్టి..

జిల్లా వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు

చిత్తూరు ఆంధ్రప్రభ బ్యూరో : ప్రజల భద్రత, రక్షణను ప్రధాన లక్ష్యంగా తీసుకుని నేరాలు, అక్రమ రవాణా కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. జిల్లాలోని ప్రధాన పట్టణాలు, గ్రామాలు, చెక్‌పోస్టులు, ముఖ్య రహదారులు, సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టడంతో పాటు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పాత నేరస్థులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించారు.

అక్రమ మద్యం, గంజాయి, నిషేధిత వస్తువుల రవాణా, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

ఈ కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం ద్వారా నేరాలను ముందుగానే అరికట్టడంతో పాటు ప్రజల్లో భద్రతా భావన పెంపొందించడమే ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ప్రతి ప్రాంతంలో పోలీసుల సాన్నిధ్యం కనిపించేలా చర్యలు తీసుకోవడం ద్వారా అసాంఘిక శక్తులకు హెచ్చరిక పంపినట్లైందని పేర్కొన్నారు.

తమ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు లేదా వాహనాలను గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.

అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసుల సహాయం పొందవచ్చని సూచించారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు హెల్మెట్ అవేర్‌నెస్, రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు కూడా నిర్వహించారు.

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పోలీసులు సూచించారు. రోడ్డు భద్రత ప్రతి పౌరుడి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.

జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ సమన్వయం, ప్రజల సహకారంతో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగించి ప్రజలకు మరింత భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Leave a Reply