వైసీపీ రక్త చరిత్రను ప్రజలు మరిచిపోరు

వైసీపీ రక్త చరిత్రను ప్రజలు మరిచిపోరు

-మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు

గొల్లపూడి (విజయవాడ రూరల్), ఆంధ్రప్రభ:
ఐదేళ్ల వైసీపీ పాలన అరాచకాలు, విధ్వంసాలు, హత్యా రాజకీయాలతో నిండిపోయిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. గొల్లపూడిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనని మండిపడ్డారు. పరిటాల రవి హత్య నుంచి సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య వరకు జరిగిన ఘోరాలను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరన్నారు. బాబాయ్ హత్య కేసులో న్యాయం చేయాలని అడిగిన సొంత చెల్లిని కోర్టుల చుట్టూ తిప్పుతూ, మరోవైపు నిందితులను సమర్థించడం జగన్‌కే చెల్లిందని దుయ్యబట్టారు. రాజకీయ లబ్ధి కోసం సొంత కుటుంబాన్నే వాడుకున్న చరిత్ర వైసీపీదేనని విమర్శించారు. గతంలో రిలయన్స్ సంస్థలపై దాడులు చేయించిన వారికే ఆ తర్వాత రాజ్యసభ సీటు ఇచ్చిన జగన్‌కు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై మాట్లాడే నైతిక హక్కు లేదని, వైసీపీ నాయకత్వం ఎప్పుడూ ద్వంద్వ వైఖరితోనే రాజకీయాలు చేసిందని ఆరోపించారు.

రాజధాని అమరావతిలో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు అత్యంత వేగంగా జరుగుతుండటాన్ని చూసి జగన్ అసూయ, ద్వేషాలతో మాట్లాడుతున్నారని దేవినేని ఉమ విమర్శించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ మంత్రిగా ఉన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 23 నెలల కాలంలోనే రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చిందని, తద్వారా 24 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా శరవేగంగా ముందుకెళ్తోందని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు, యువతకు ఉపాధి అవకాశాలు వస్తున్నాయని తెలిపారు.

రాష్ట్రంలో ప్రాధాన్యత క్రమంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి, ప్రతి ఎకరాకు సాగునీరు అందించే అద్భుతమైన లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని దేవినేని ఉమ వివరించారు. కానీ వైసీపీ మాత్రం తాడేపల్లి ప్యాలెస్‌లో కొంతమందిని కూర్చోబెట్టి ప్రెస్‌మీట్లు నిర్వహిస్తూ నిత్యం అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇలాంటి అబద్ధాలతో ప్రజలను మళ్లీ మభ్యపెట్టే రోజులు పోయాయని, రాష్ట్ర ప్రజలంతా కేవలం అభివృద్ధి, సంక్షేమం మాత్రమే కోరుకుంటున్నారని దేవినేని ఉమ స్పష్టం చేశారు.

Leave a Reply