ఎడ్యుకేషనల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు

ఎడ్యుకేషనల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు

  • డీటీసీ ఎం పురేంద్ర

విజయవాడ, ఆంధ్రప్రభ: విద్యార్థులను విద్యాసంస్థలకు తీసుకొని వెళ్లే బస్సులపై తనిఖీలు నిర్వహించి భద్రత ప్రమాణాలను పరిశీలిస్తున్నామని డిటిసి ఎం పురేంద్ర తెలిపారు. స్థానిక బందరు రోడ్డు లోని డీటీసీ కార్యాలయం లో డీటీసీ యం. పురేంద్ర మాట్లాడుతూ విద్యార్థులను స్కూలుకు కాలేజీలకు తీసుకొని వెళ్లే బస్సులలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ జిల్లాలోని స్కూల్స్, కాలేజ్ బస్సులపై ప్రత్యేక తనిఖీలను రవాణాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు విస్తృతంగా కొనసాగిస్తున్నట్లు డీటీసీ యం. పురేంద్ర తెలిపారు. జిల్లాలో 1571 విద్యాసంస్థలకు చెందిన బస్సులు నడుస్తున్నాయని, వాటిపై ఈనెల 1వ తారీఖు నుండి ప్రత్యేక తనిఖీలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

జిల్లావ్యాప్తంగా 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ప్రతి బృందానికి సుమారు 130 బస్సుల చొప్పున తనిఖీ బాధ్యతలు అప్పగించినట్లు డీటీసీ వెల్లడించారు. ఈ తనిఖీలు ఆంధ్రప్రదేశ్ మోటారు వాహన నియమావళి లోని కేంద్ర మోటారు వాహన నియమాలు, ఇతర రోడ్డు భద్రతా ప్రమాణాల ప్రకారం తనిఖీలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. ఇప్పటివరకు సుమారు 250 బస్సులను తనిఖీ చేయగా పలు భద్రతా లోపాలు గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. తనిఖీలలో ప్రధానంగా గుర్తించిన లోపాలలో అత్యవసర ద్వారాల వద్ద సీట్లు ఏర్పాటు చేయడం వల్ల ఎమర్జెన్సీ ఎగ్జిట్‌కు ఆటంకం కలగడం, వి ఎల్ టి డి పరికరాలు లేకపోవడం,ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు లేకపోవడం లేదా పనిచేయని స్థితిలో ఉండడం, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన సేఫ్టీ హ్యామర్లు అందుబాటులో లేకపోవడం,ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు, రిఫ్లెక్టివ్ టేపులు ఇతర భద్రతా పరికరాలలో లోపాలు ఉండడం
గుర్తించామని అన్నారు.

గుర్తించిన లోపాలపై సంబంధిత విద్యాసంస్థల యాజమాన్యాలకు నోటీసులు జారీ చెయ్యడం జరిగిందన్నారు. ఈ నెల 20వ తారీఖు లోపు అన్ని లోపాలను సరిచేసుకోవాలని ఆదేశించినట్లు డీటీసీ తెలిపారు. స్కూల్ బస్సుల తనిఖీల సందర్భంగా బస్సులలో అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థులను సురక్షితంగా బయటకు తరలించే విధానంపై ఎవాక్యువేషన్ డెమో నిర్వహించడంతో పాటు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ల వినియోగంపై డ్రైవర్లు, అటెండర్లు, విద్యాసంస్థల సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నట్లు పురేంద్ర తెలిపారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందుగానే అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు తమ బస్సులను పూర్తి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేసి, ఎటువంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని పురేంద్ర విజ్ఞప్తి చేశారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా లోపభూయిష్టమైన లేదా అనర్హమైన బస్సులతో విద్యార్థులను రవాణా చేసిన పక్షంలో మోటారు వాహన చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

Leave a Reply