సేవాభావం చాటుకున్న టీడీపీ నేతలు

సేవాభావం చాటుకున్న టీడీపీ నేతలు

తాడిచెట్టు పడి ధ్వంసమైన ఇంటిని బాగు చేసిన తెలుగు తమ్ముళ్లు..
తాడిచెట్టును తొలగించి ఇంటిని పరిశుభ్రపరిచిన కనపర్తి, టీడీపీ నేతలు

అవనిగడ్డ, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని పులిగడ్డ గ్రామంలో రెండు రోజుల క్రితం వీచిన భారీ ఈదురు గాలులకు తాడి చెట్టు కూలి నిరుపేద కుటుంబానికి చెందిన చెన్ను వెంకటేశ్వరరావు ఇంటి పైకప్పు పై పడటంతో, నిలువ నీడ లేక ఆ కుటుంబం రోడ్డున పడింది. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు శనివారం సాయంత్రం తక్షణమే స్పందించారు. వెంకటేశ్వరరావు నివాసానికి స్వయంగా వెళ్లి, దెబ్బతిన్న ఇంటిని పరిశీలించారు. బాధితుడిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

అనంతరం ఆయన స్థానిక అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, నష్టపరిహారం అందేలా చూడాలని కోరారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కనపర్తి శ్రీనివాసరావు నేరుగా ఫోన్లో మాట్లాడారు. బాధిత కుటుంబం ఉన్న దీనస్థితిని వివరించి, తక్షణమే ప్రభుత్వం తరపున ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీని పై సానుకూలంగా స్పందించిన కలెక్టర్.. బాధిత కుటుంబానికి తగిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. బాధల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడమే కూటమి ప్రభుత్వం ఆశయం అని కనపర్తి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వెంకటేశ్వరరావు కుటుంబానికి ప్రభుత్వం నుండి పూర్తి పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

శ్రమదానం చేసిన తెలుగు తమ్ముళ్లు..
ఎప్పుడూ తెల్ల చొక్కాలు.. మెడలో పసుపు కండువాలతో కనిపించే టీడీపీ నేతలు తమ సేవ భావంతో దాతృత్వాన్ని చాటుకున్నారు. తాము శ్రమజీవులమేనని బడుగు జీవి కుటుంబానికి ఆసరాగా నిలబడ్డారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు, దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు అవనిగడ్డ క్లస్టర్ ఇంచార్జ్ బండే రాఘవ, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్వయంగా రంగంలోకి దిగారు. జేసీబీలు, వేరే మనుషుల కోసం ఎదురుచూడకుండా.. వారే స్వయంగా ఇంటి పై పడిన భారీ తాడి చెట్టును తొలగించి శ్రమదానం చేశారు. బాధితుడికి మేమున్నామంటూ అండగా నిలబడ్డారు.

నాయకులంటే కేవలం వచ్చి చూసి వెళ్ళడం కాదు.. కష్టంలో తోడుండటం అంటూ స్థానిక ప్రజలు టీడీపీ నాయకుల చొరవపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మండలి రామమోహనరావు, పర్చూరి దుర్గాప్రసాద్, నాగిడి శివ నాగేశ్వరరావు, దాసినేని శ్రీనివాసరావు, చెన్ను బాబూరావు, గుంటూరు వినయ్ బాబు, నాగిడి రాంబాబు, కోట సాయి, చెన్ను రాంబాబు, చెన్ను నాగేంద్రం జనసేన నాయకుడు మండలి శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply