అత‌డి ఎంట్రీతో కొత్త కొత్తగా టీమిండియా…

  • టీ20 సిరీస్‌లో భారీ మార్పులు
  • ఐర్లాండ్‌తో టీ20 సిరీస్
  • కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..
  • వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మ
  • వైభవ్ సూర్యవంశీకి డ్రీమ్ ఎంట్రీ

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్ విజయానంతరం భారత జట్టు మరోసారి పొట్టి ఫార్మాట్‌లో బరిలోకి దిగుతోంది. ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ శుక్రవారం బెల్‌ఫాస్ట్‌లోని స్టోర్మాంట్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ సిరీస్‌తో టీమిండియాలో కొత్త శకం ప్రారంభం కానుంది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ తొలిసారి పూర్తి స్థాయి టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.

ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లలో టీమిండియా టీ20 కొత్త‌ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా తన నాయకత్వ ప్రతిభను నిరూపించుకున్న అయ్యర్‌కు ఇప్పుడు భారత జట్టు పగ్గాలు అప్పగించారు. ఇక, తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు భారీ ప్రమోషన్ లభించింది. అతడిని టీమిండియా వైస్ కెప్టెన్‌గా నియమించడం విశేషం.

అయితే, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్‌లకు ఎంపిక కాలేదు. అలాగే ఫినిషర్ రింకూ సింగ్, స్పిన్ విభాగంలో కీలక ఆటగాడు కుల్దీప్ యాదవ్ కూడా జట్టులో చోటు దక్క‌లేదు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతి ఇచ్చారు.

ఈ సిరీస్‌లో అందరి దృష్టి మాత్రం 15 ఏళ్ల టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. వైభవ్ సూర్యవంశీకి తొలిసారి టీమిండియా పిలుపు అందింది. ఐపీఎల్‌లో తన పేలుడు బ్యాటింగ్‌తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఈ యువ బ్యాటర్, ఇటీవల ఇండియా-ఏ తరఫున ట్రై సిరీస్‌లోనూ మెరిశాడు. దీంతో అతడి అంతర్జాతీయ అరంగేట్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

వైభవ్ సూర్యవంశీ ఐర్లాండ్ తో మ్యాచ్‌లో అరంగేట్రం చేస్తే… అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడైన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించ‌నున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండగా, టీ20ల్లో అతి చిన్న వయసులో అరంగేట్రం చేసిన భారత ఆటగాడిగా వాషింగ్టన్ సుందర్ రికార్డు కొనసాగుతోంది.

అలాగే ఈ సిరీస్‌లో యువ పేసర్ ప్రిన్స్ యాదవ్‌కు కూడా తొలిసారి అవకాశం దక్కింది. గత కొంతకాలంగా జట్టుకు దూరమైన హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్ మళ్లీ టీమిండియాలోకి తిరిగి వచ్చారు. ఈ మార్పులతో కొత్త తరానికి అవకాశం ఇస్తూ టీమిండియా భవిష్యత్ దిశను సెలెక్షన్ కమిటీ స్పష్టంగా చూపించింది.

మరోవైపు ఐర్లాండ్ కూడా కొత్త కెప్టెన్ లోర్కన్ టక్కర్ నాయకత్వంలో బరిలోకి దిగుతోంది. ప్రపంచ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న భారత్‌కు, 12వ స్థానంలో ఉన్న ఐర్లాండ్ గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటివరకు భార‌త్-ఐర్లాండ్ జట్లు టీ20ల్లో ఎనిమిది సార్లు తలపడగా, అన్ని మ్యాచ్‌ల్లోనూ భారత్‌దే విజయం కావ‌డం విషేశం. 2023లో జరిగిన చివరి సిరీస్‌ను కూడా భారత్ 2-0తో కైవసం చేసుకుంది. ఈసారి కూడా అదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది.

సిరీస్ షెడ్యూల్ (భారత కాలమానం ప్రకారం)

జూన్ 26: తొలి టీ20 – సాయంత్రం 6:00 గంటలకు
జూన్ 28: రెండో టీ20 – సాయంత్రం 6:00 గంటలకు

ఎక్కడ చూడొచ్చు?

ఐర్లాండ్-భారత్ టీ20 సిరీస్‌ను సోనీ స్పోర్ట్స్ టెన్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనుండగా, సోనీలివ్ వేదికలో ప్రత్యక్ష ప్రసారం (లైవ్ స్ట్రీమింగ్) అందుబాటులో ఉంటుంది.