గంజాయి, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

దస్తూరాబాద్, ఆంధ్రప్రభ: యువత, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు (డ్రగ్స్) దూరంగా ఉండాలని దస్తూరాబాద్ ఎస్‌ఐ సాయికుమార్ పిలుపునిచ్చారు. గురువారం మున్యాల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్‌ఎస్)లో దస్తూరాబాద్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది విద్యార్థులతో నేరుగా ముచ్చటించి గంజాయి, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక దుష్ప్రభావాల గురించి వివరించారు. చిన్న వయసులోనే ఇలాంటి వ్యసనాలకు బానిసలైతే జీవితాలు ఎలా అంధకారమవుతాయో ఉదాహరణలతో అవగాహన కల్పించారు. విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, మంచి భవిష్యత్తు కోసం కృషి చేయాలని సూచించారు. గ్రామంలో ఎవరైనా గంజాయి విక్రయించినా లేదా రవాణా చేసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

మాదకద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులు, యువత కీలక పాత్ర పోషించాలని, సమాజాన్ని వ్యసనాల బారిన పడకుండా కాపాడేందుకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్‌ఐ సాయికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.