అప్పుల భారం… చివరకు ప్రాణం తీసింది

  • పురుగుల మందు తాగిన రైతు-వ్యాపారి చికిత్స పొందుతూ మృతి

చిట్యాల, ఆంధ్రప్రభ: అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన విషాద ఘటన గురువారం చిట్యాల మండలంలోని జూకల్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం… మండలంలోని జూకల్ గ్రామానికి చెందిన సౌడ కిషన్ (32)కు పదేళ్ల క్రితం అశ్వినితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కిషన్ గత రెండేళ్లుగా వ్యవసాయంతో పాటు స్థానికంగా మొక్కజొన్న, పత్తి కొనుగోలు వ్యాపారం నిర్వహిస్తున్నాడు.

ఇటీవల పత్తి పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోవడంతో పంట నష్టపోయాడు. అదే సమయంలో వ్యాపారంలో కూడా భారీ నష్టాలు రావడంతో ఆర్థిక ఇబ్బందులు మరింత పెరిగాయి. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక తీవ్ర మనస్తాపానికి గురైన కిషన్ పది రోజుల క్రితం క్రిమిసంహారక మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు, అక్కడి నుంచి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం కిషన్ మృతి చెందాడు.

అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపానికి గురై తన భర్త పురుగుల మందు తాగినట్లు మృతుడి భార్య అశ్విని ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ సతీష్ తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.