మాదకద్రవ్యాల నిర్మూలనకు అందరూ సహకరించాలి
ఉట్నూర్ ఆంధ్రప్రభ:మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, యువత డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏఎస్పీ రిత్విక్ సాయి పిలుపునిచ్చారు.గురువారం ఉట్నూర్ మండల కేంద్రంలోని కె.బి. కాంప్లెక్స్‌లో గల పీఎంఆర్‌సీ భవనంలో ఉట్నూర్ పోలీసుల ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఎస్పీ రిత్విక్ సాయి మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు, యువతపై వాటి ప్రభావం, డ్రగ్స్‌కు దూరంగా ఉండాల్సిన అవసరంపై వివరించారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాలను, సమాజాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.
డ్రగ్స్ వినియోగం, రవాణా, విక్రయాలకు సంబంధించిన చట్టపరమైన చర్యలపై కూడా అవగాహన కల్పించారు. యువత తమ లక్ష్యాల సాధనపై దృష్టి సారించి, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉట్నూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మడావి ప్రసాద్, ఎస్‌ఐ గుంపుల విజయ్, క్రీడా అధికారి జాదవ్ హేమంత్, పోలీసు అధికారులు, వివిధ కళాశాలల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
