ఇంద్రకీలాద్రిపై వైభవంగా కూచిపూడి నృత్య ప్రదర్శన

ఇంద్రకీలాద్రిపై వైభవంగా కూచిపూడి నృత్య ప్రదర్శన
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడ లోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శనివారం నిర్వహించిన ‘ధర్మపథం’ సాంస్కృతిక కార్యక్రమం భక్తులను అలరించింది. కాకినాడకు చెందిన శ్రీ బాలాత్రిపుర సుందరి కూచిపూడి నాట్య పాఠశాల కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక శోభను నింపింది. నాట్య గురువులు బి. సత్యనారాయణ పర్యవేక్షణలో కళాకారులు పలు ఆధ్యాత్మిక అంశాలను అత్యంత అద్భుతంగా ప్రదర్శించారు. గణపతి ప్రార్థనతో (మూషిక వాహన..) కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.
అనంతరం ‘బ్రహ్మాంజలి’ నృత్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ‘కామేశ్వరీ మహేశ్వరి’ , ‘దుర్గా స్తుతి’ వంటి ప్రదర్శనల ద్వారా అమ్మవారి వైభవాన్ని కళాకారులు తమ అభినయంతో ఆవిష్కరించారు. చివరగా అన్నమాచార్య కీర్తనలకు చేసిన నృత్య ప్రదర్శన భక్తుల ప్రశంసలు అందుకుంది. సహజసిద్ధమైన ముద్రలు, లయబద్ధమైన పాదఘట్టనలతో సాగిన ఈ కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులకు కనువిందు చేసింది. ప్రదర్శన అనంతరం కళాకారులను దేవస్థాన మర్యాదలతో గౌరవించి, అమ్మవారి ప్రసాదాలను అందజేశారు.
