కన్నీరు పెడుతున్న అన్నదాత..

కన్నీరు పెడుతున్న అన్నదాత..

తడిసిన ధాన్యం – ఆవిరవుతున్న ఆశలు.
మిల్లర్ల ‘తరుగు’ దందా
సివిల్ సప్లైస్ శాఖ నిర్లక్ష్యం
పర్యటనల్లో మంత్రులు, కష్టాల్లో రైతులు
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం!

ఆంధ్రప్రభ విజయవాడ రూరల్ : విజయవాడ శివారు కుందా వారి కండ్రిక ప్రాంతాల్లో అకాల వర్షాలు అన్నదాతను నిలువునా ముంచాయి. కండ్రిక శివారులో తడిసిన ధాన్యపు కల్లాలను మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరిశీలించారు. క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందులను చూసి చలించిపోయిన ఆయన, తక్షణమే ప్రభుత్వం స్పందించకుంటే భారీ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు జాయింట్ కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ​వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. కళ్ళ ముందే ధాన్యం తడిసిపోతుంటే గిట్టుబాటు ధర లేక, అమ్ముకునే మార్గం లేక రైతులు విలవిలలాడుతున్నారన్నారు.

వ్యవసాయ శాఖ సూచనతో 126 రకం వరి వేసిన రైతులకు ఇప్పుడు కొత్త కష్టాలు మొదలయ్యాయనీ, మిల్లుల్లో నూక అవుతోందనే సాకుతో క్వింటాకు 10 కేజీల తరుగు ఇవ్వాలని మిల్లర్లు ఒత్తిడి తెస్తుండటంపై మల్లాది విష్ణు మండిపడ్డారు.పంటను తరలించేందుకు కనీసం గోనె సంచులు కూడా అందుబాటులో లేవు.. లారీలు, ట్రాక్టర్లు మిల్లుల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో రవాణా ఖర్చులు రైతుకు తడిసి మోపెడవుతున్నాయనీ మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి సింగపూర్ పర్యటనలో ఉన్నారన్నారు. మంత్రుల విదేశీ పర్యటనలపై ఉన్న శ్రద్ధ, రైతుల సంక్షేమంపై లేదనీ మల్లాది విష్ణు పేర్కొన్నారు. అధికారులు గడువులోగా స్పందించకపోతే రైతులతో కలిసి భారీ ఉద్యమ కార్యాచరణ చేపడతామని మల్లాది విష్ణు హెచ్చరించారువిత్తన సేకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 110 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలనీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు క్షేత్రస్థాయిలో సమస్యను పరిష్కరించాలి.. అటు శనగ రైతులు, ఇటు వరి రైతులు అందరూ దయనీయ స్థితిలో ఉన్నారని, ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి అన్నదాతను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Leave a Reply