డీలిమిటేషన్ పేరుతో మహిళలకు మోసం..

డీలిమిటేషన్ పేరుతో మహిళలకు మోసం..

శివాజీ
ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించండి..
పలు ప్రజా సమస్యలపై చర్చించాలి
మాజీ కేంద్రమంత్రి జె డి సేలం

విజయవాడ, ఆంధ్రప్రభ : డిలిమిటేషన్ పేరుతో మహిళలను మరోసారి మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని మాజీ కేంద్రమంత్రి జేడీ సేలం విమర్శించారు. విజయవాడ లోని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పత్రికా సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి జె డి శీలం ఏపీసీసీ ఉపాధ్యక్షుడు శివాజీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో కేంద్ర ప్రభుత్వం రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఏప్రిల్ 16న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేసి డీలిమిటేషన్ బిల్లును ఆమోదించేందుకు 131వ సవరణ పేరుతో చేసిన ప్రయత్నమే గానీ, ఇది అసలు మహిళా సాధికారతకు సంబంధించినది కాదని అన్నారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు మహిళా రిజర్వేషన్‌ను అనుసంధానం చేయడం పెద్ద మోసమని పేర్కొన్నారు. తాజా జనగణనను పక్కనబెట్టి 2011 గణాంకాల ఆధారంగా రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పడం మహిళలను తప్పుదోవ పట్టించడమేనని విమర్శించారు.

2023 సెప్టెంబర్ 20న ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వెంటనే అమలు చేసి, 2029 లోక్‌సభ ఎన్నికల్లో 543 స్థానాల్లో కనీసం 181 స్థానాలను మహిళలకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. బిల్లు ఆమోదం కాలేదని కాంగ్రెస్ మిత్రపక్షాలపై నెపం మోపడం బీజేపీ కూటమి ఎత్తుగడ అని ఆరోపించారు. డీలిమిటేషన్ వల్ల ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంట్ స్థానాలు తగ్గే ప్రమాదం ఉన్నప్పటికీ దాన్ని అడ్డుకోలేకపోతున్నారని సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి , నాయకుడు పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు పెట్రోలు కొరత, వాణిజ్య గ్యాస్ ధరల పెంపు, అమరావతి ప్రాంతంలో భూసేకరణ, పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర సహకారం వంటి అంశాలపై చర్చించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. లేకపోతే అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. దళిత క్రైస్తవులకు ఎస్‌సీ హోదా కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, బీజేపీ-టీడీపీ కూటమి మాటలను నమ్మవద్దని దళిత క్రైస్తవులకు విజ్ఞప్తి చేశారు.