పీఎం సూర్యఘార్ పథకం అమలులో కర్నూలు రెండో స్థానం

పీఎం సూర్యఘార్ పథకం అమలులో కర్నూలు రెండో స్థానం

-కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి

కర్నూలు, ఆంధ్ర ప్రభ: పీఎం సూర్యఘార్ పథకం అమలును వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆదేశించారు. వచ్చే వారంలోనే 1000కి పైగా సోలార్ రూఫ్‌టాప్‌లను ఇన్‌స్టాల్ చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈకి సూచించారు. శుక్రవారం నగరంలోని బీడీ వర్కర్ కాలనీలో గౌరమ్మ ఇంటి పై ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్‌టాప్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో యుఎల్ఏ మోడల్‌లో అమలు చేసిన ఈ యూనిట్ పనితీరును సమీక్షించి, లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు.

ఈ సందర్భంగా గౌరమ్మతో మాట్లాడిన కలెక్టర్, సోలార్ రూఫ్‌టాప్ ఇన్‌స్టాలేషన్ సమయం, వినియోగం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. సోలార్ రూఫ్‌టాప్‌ల ద్వారా వినియోగదారులు ఉచిత విద్యుత్‌ను వినియోగించుకోవడమే కాకుండా, విద్యుత్ ఉత్పత్తిదారులుగా మారే అవకాశం ఉందని తెలిపారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఈ సౌకర్యం పూర్తిగా ఉచితంగా లభిస్తుందని, ఇతరులకు మొదటి కిలోవాట్‌కు రూ.30 వేల వరకు, రెండో కిలోవాట్‌కు మరో రూ.30 వేల వరకు, 3 కిలోవాట్‌కు రూ.78 వేల వరకు సబ్సిడీ అందిస్తుందని వివరించారు. ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
జిల్లాలో ఇప్పటివరకు పీఎం సూర్యఘార్ పథకం కింద 23,077 సోలార్ రూఫ్‌టాప్‌లు మంజూరయ్యాయని, వాటిలో 3,038 యూనిట్లు ఇప్పటికే ఇన్‌స్టాల్ చేయబడినట్లు తెలిపారు. ఈ ప్రగతితో రాష్ట్రంలో కర్నూలు జిల్లా రెండో స్థానంలో నిలిచిందన్నారు.

రాబోయే రోజుల్లో మరింత వేగంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.సోలార్ రూఫ్‌టాప్‌ల ఇన్‌స్టాలేషన్‌లో రోటోమాగ్, బృహస్పతి కంపెనీలు నెమ్మదిగా వ్యవహరిస్తున్నాయని గమనించిన కలెక్టర్, పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ ప్రదీప్ కుమార్, కర్నూలు టౌన్ ఈఈ శేషాద్రి, డీఈ విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply