ఎన్‌ఆర్‌ఐ ఎంబీబీఎస్ కు 4½ ఏళ్లకే ట్యూషన్ ఫీజు

ఎన్‌ఆర్‌ఐ ఎంబీబీఎస్ కు 4½ ఏళ్లకే ట్యూషన్ ఫీజు
టీ టీ డి ఈ ఓ నిర్ణయం
తిరుపతి (రాయలసీమ బ్యూరో ) ఆంధ్రప్రభ : తిరుమల తిరుపతి దేవస్థానాలకు (టీ టీ డి ) చెందిన శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో ఎం బి బి ఎస్ కోర్సు చదువుతున్న ప్రవాస భారతీయ ( ఎన్ ఆర్ ఐ ) విద్యార్థులు ఇకపై 5 ఏళ్లకు కాకుండా 4½ ఏళ్లకే ట్యూషన్ ఫీజులు చెల్లిస్తే సరిపోతుంది. స్విమ్స్ వైద్యకళాశాలలో 2021-2022 బ్యాచ్ ఎం బి బి ఎస్ కోర్సులో చేరిన ఎన్ ఆర్ ఐ విద్యార్థుల కోర్సు వ్యవధి 4½ సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం చివరి సంవత్సరంలో ఉన్న ఆ విద్యార్థులు ఇతర ఎం బి బి ఎస్ విద్యార్థుల లాగే 5 ఏళ్ల కు ఫీజు చెల్లించాలని కళాశాల అధికార వర్గం ప్రకటించింది.
దానిపై ఆ కళాశాలలో చదువుతున్న 24 మంది ఎన్ ఆర్ ఐ విద్యార్థుల తల్లితండ్రులు ఇటీవల టిటిడి ఈవో ఎం.రవిచంద్ర ను కలిసి తమ పిల్లల కోర్సు వ్యవధిలోని తేడాను గురించి తెలియచేసారు.
ఈ అంశాన్ని పరిశీలించిన టిటిడి ఈవో, నేషనల్ మెడికల్ కమిషన్ 2026 ఏప్రిల్ 7 వ తేదీన జారీ చేసిన నిబంధనలను పరిశీలించి, ఎన్ఆర్ఐ ఎంబీబీఎస్ కోర్సుకు ఫీజులు 4½ సంవత్సరాలకే వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం పై స్విమ్స్ పాలకమండలి సమావేశంలో చర్చించి, తగిన ఆమోదం (రాటిఫికేషన్) పొందేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దీంతో ప్రస్తుతం స్విమ్స్ వైద్య కళాశాల లో చివరి సంవత్సరంలో ఉన్న 2021-22 బ్యాచ్ విద్యార్థులకు 4½ సంవత్సరాలకే ఫీజులు వర్తింపజేయాలని నిర్ణయించారు. ఇదే విధానం ఇకపై వచ్చే తదుపరి బ్యాచ్‌లకు కూడా అమలు కానున్నది.
