దివ్యాంగుల శాఖ అధికారిపై విచారణకు ఆదేశం..

దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ వినోద్‌పై విచారణకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు

జేఏసీ ఫిర్యాదుపై స్పందించిన ప్రభుత్వం..
జిల్లా కలెక్టర్, శాఖ డైరెక్టర్‌కు సమగ్ర విచారణ బాధ్యతలు..
ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని స్పష్టమైన ఆదేశాలు


(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ) : చిత్తూరు జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వినోద్‌పై దివ్యాంగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) చేసిన అవినీతి, అక్రమాల ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్‌తో పాటు మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి ఎస్. జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ దివ్యాంగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు 2026 జూన్ 4న సమర్పించిన ఫిర్యాదు, దానికి జత చేసిన ఆధారాలను పరిశీలించిన ప్రభుత్వం, ఫిర్యాదు ప్రతిని చిత్తూరు జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్‌తో పాటు శాఖ డైరెక్టర్‌కు పంపించింది. ఈ వ్యవహారంపై క్షుణ్ణంగా విచారణ నిర్వహించి, ప్రభుత్వం తీసుకోవాల్సిన తదుపరి చర్యల కోసం తమ నివేదికను ప్రభుత్వానికి పంపాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది.

గత మే 5, జూన్ 8 తేదీల్లో దివ్యాంగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన నాయకులు, ఏడీ వినోద్ భారీ ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిధుల వినియోగానికి సంబంధించిన బిల్లులు, వోచర్లు, చెక్కులు, బ్యాంకు చెల్లింపుల వివరాలు, ఇతర పత్రాలతో కూడిన ఆధారాలను జిల్లా కలెక్టర్‌కు సమర్పించి, స్వతంత్రంగా సమగ్ర విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇదే అంశంపై రాష్ట్రస్థాయిలో కూడా జేఏసీ నాయకులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం అధికారికంగా విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

జేఏసీ చేసిన ప్రధాన ఆరోపణలు

జేఏసీ ఫిర్యాదు ప్రకారం, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ సీనియర్ సిటిజన్స్ పథకాల కింద కేటాయించిన ప్రభుత్వ నిధులను నిబంధనలకు విరుద్ధంగా వినియోగించారని ఆరోపించింది. దివ్యాంగులకు పంపిణీ చేయాల్సిన ట్రైసైకిళ్లు, మోటరైజ్డ్ ట్రైసైకిళ్లు, వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు, స్మార్ట్ కేన్లు, వాకర్లు, క్రచ్‌లు, టాయిలెట్ చెయర్లు తదితర సహాయక పరికరాల కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయని పేర్కొంది. కొనుగోలు ప్రక్రియలో టెండర్ నిబంధనలను పాటించకుండా ఒకే సంస్థలకు ప్రయోజనం కల్పించడం, మార్కెట్ ధర కంటే అధిక ధరలకు పరికరాలు కొనుగోలు చేయడం, ఒకే తరహా వస్తువులకు వేర్వేరు ధరలు చూపించి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడం, నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరపడం వంటి అంశాలను ఫిర్యాదులో వివరించారు.

ఇందుకు సంబంధించి పలు బిల్లులు, చెక్కులు, డీడీలు, బ్యాంకు లావాదేవీల వివరాలను ఆధారాలుగా జత చేశారు. అలాగే, లక్షల రూపాయల విలువైన పరికరాల కొనుగోళ్లలో నకిలీ లేదా అనుమానాస్పద బిల్లులు సృష్టించడం, ప్రభుత్వ నిధులను వ్యక్తిగత ప్రయోజనాలకు మళ్లించడం, ఖజానాకు భారీ నష్టం కలిగించే విధంగా వ్యవహరించారని జేఏసీ ఆరోపించింది. కొన్ని కొనుగోళ్లలో పరికరాలు సరఫరా కాకముందే చెల్లింపులు జరిగాయని, మరికొన్ని చోట్ల ఒకే పరికరానికి భిన్నమైన ధరలు చూపించారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. జేఏసీ సమర్పించిన ఆధారాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విచారణకు ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

విచారణలో వాస్తవాలు నిర్ధారణ అయితే బాధ్యులపై శాఖాపరమైన చర్యలతో పాటు అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే విచారణ నివేదికను ప్రభుత్వం పరిశీలించిన అనంతరం తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాలతో ఈ కేసు అధికారిక విచారణ దశలోకి ప్రవేశించడం జిల్లాలో ఆసక్తికరంగా మారింది.