మహిళా బిల్లు దేశ పురోగతికి మైలురాయి

మహిళా బిల్లు దేశ పురోగతికి మైలురాయి

  • విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్

విజయవాడ , ఆంధ్రప్రభ: పార్లమెంటు ముందుకు వస్తున్న మహిళా బిల్లు దేశ పురోగతికి మరో మైలురాయిగా నిలవనుండని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఎంపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో కీలక రాజకీయ అంశాలపై ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టడం చారిత్రాత్మక నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. మహిళలకు రాజకీయాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా దేశ అభివృద్ధికి మరింత బలం చేకూరుతుందని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో రాజ్యాంగ సవరణల ద్వారా మహిళా బిల్లు ముందుకు రావడం దేశానికి మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.

కుటుంబ వ్యవస్థలో మహిళల పాత్ర ఎంత ముఖ్యమో, అదే విధంగా రాజకీయాల్లోనూ వారు సమర్థంగా రాణిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే మహిళా సాధికారతకు కట్టుబడి ఉందని, ఎన్టీఆర్ కాలంలోనే స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మహిళలకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడుతూ.. అమరావతి రాజధాని అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించడం కీలకమని పేర్కొన్నారు. తిరువూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని, తాగునీరు, రహదారులు, పరిశ్రమల ఏర్పాటుకు కోట్లాది రూపాయల నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్‌బీ, నరేగా, సీఎస్ఆర్ ద్వారా పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు.

ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఎంపీ, అమరావతి విషయంలో అవమానకర వ్యాఖ్యలు చేయడం ప్రజలు సహించరని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం రాజకీయ దురుద్దేశ్యమని విమర్శించారు. తనపై వచ్చిన ఆర్థిక ఆరోపణలను ఖండిస్తూ, అవి పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు. ప్రజాసేవలో పారదర్శకతతో ముందుకు సాగుతున్నానని, ఎలాంటి లావాదేవీలు లేవని తెలిపారు. మీడియా సంస్థలు నిర్ధారణ లేకుండా వార్తలు ప్రచురించకూడదని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిస్తూ.. మహిళా బిల్లు ఆమోదం పొందడం ద్వారా దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు.

Leave a Reply