సాగునీటి కోసం వైసీపీ నిరాహార దీక్షలు
కృష్ణా డెల్టాకు వెంటనే నీరు విడుదల చేయాలని డిమాండ్
అవనిగడ్డ, మచిలీపట్నం, గూడూరులో వైసీపీ నేతల ఆందోళనలు
కృష్ణా బ్యూరో, ఆంధ్రప్రభ: కృష్ణా డెల్టాకు వెంటనే సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం నిరాహార దీక్షలు నిర్వహించారు. అవనిగడ్డ మండలం పులిగడ్డ అక్విడెక్ట్ వద్ద మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షను మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్ ఆర్థర్ కాటన్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
దీక్షలో మాట్లాడిన పేర్ని నాని.. రైతులు వరి సాగు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం సాగునీటి విడుదలలో జాప్యం చేస్తోందని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కరువు పరిస్థితుల్లోనూ కృష్ణా డెల్టాకు సాగునీరు అందించామని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు అందించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదే డిమాండ్‌తో మచిలీపట్నం నార్త్ మండలం కొత్తపూడి చర్చి వద్ద రైతుల రిలే నిరాహార దీక్షలో వైసీపీ మచిలీపట్నం ఇన్‌చార్జి పేర్ని కిట్టు పాల్గొన్నారు. గూడూరు మెయిన్‌సెంటర్‌లో పెడన నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి ఉప్పాల రాము, జడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారికతో పాటు పార్టీ నాయకులు, రైతులు నిరాహార దీక్ష చేపట్టి సాగునీటిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
