AP | మోసం, వంచనతో పాలన

AP | మోసం, వంచనతో పాలన

  • సీఎం చంద్రబాబుకు ఇకనైనా సద్భుద్ది రావాలి
  • ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ వద్దు
  • వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్

AP | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి మండల కేంద్రంలోని ఎర్రగుంట పంచాయతీ నేతలపల్లి గ్రామంలో మాజీ మంత్రివర్యులు, వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో ఈ రోజు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా భోగి మంటలు వేసిన పార్టీ నాయకులు, పీపీపీ విధానం లోకి మెడికల్‌ కాలేజీలకు సంబంధించిన జీఓ ప్రతులు ఆ మంటల్లో దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం మార్చుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ.. మాయమాటలు, అబద్ధపు మాటలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి, గత 19 నెలలుగా మోసం, వంచనతో పాలన సాగిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు మరోసారి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. అందుకే కూటమి పెద్దల మనసుల్లో నిండి ఉన్న మోసం, వంచన, నిరంకుశత్వం వంటి దుర్గుణాలన్నీ ఈ భోగి మంటల్లో కాలిపోవాలని, కనీసం ఇప్పుడైనా ప్రజలకు మేలు చేసేలా సీఎం చంద్రబాబుకు సద్బుధ్ది ఇవ్వాలని దేవుడిని ప్రార్థించాం. ముఖ్యంగా ప్రజారోగ్య రంగాన్ని నిర్వీర్యం చేసేలా 10 కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించాన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఆయన మనసు మార్చాలని దేవుడిని ప్రార్థించాం. అలాగే, ఆ నిర్ణయంపై మా నిరసన వ్యక్తం చేస్తూ, మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించిన జీఓ ప్రతులు భోగి మంటల్లో దహనం చేసామన్నారు..

కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు.. ఇలా అన్ని వర్గాలకు తీవ్రమైన ద్రోహం చేశారు. ఇకనైనా వారి మేలు గురించి ప్రభుత్వం ఆలోచించాలి. వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లూ రాష్ట్ర ప్రజలంతా సంక్రాంతి పండుగను ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటే, కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న ఈ రెండో సంక్రాంతికి కూడా ఏ ఇంటా ఆ శోభ కనిపించడం లేదు. ముఖ్యంగా కూటమి పాలనలో మహిళలు అన్ని విధాలుగా నష్టపోయారు. ఇకనైనా గత ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి మండల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply