ఆసియా బాక్సింగ్‌.. భారత అమ్మాయిల గోల్డెన్ పంచ్…

  • మూడు స్వర్ణాలు.. 10 రజతాలు.. నాలుగు కాంస్యాలు
  • మొత్తం 17 పతకాలతో భారత మహిళా బాక్సర్ల సత్తా
  • చంద్రిక, ప్రాచి, నిషా ఖాతాలో బంగారు పతకాలు

ఆంధ్రప్రభ, జకార్తా : ఆసియా అండర్-19, అండర్-23 బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళా బాక్సర్లు పంచ్ పవర్ చూపించారు. జకార్తాలో జరిగిన పోటీల్లో మూడు స్వర్ణాలు, 10 రజతాలు, నాలుగు కాంస్యాలతో మొత్తం 17 పతకాలు సాధించి సత్తా చాటారు. చంద్రిక పూజారి, ప్రాచి, నిషా తమ విభాగాల్లో స్వర్ణ పతకాలు గెలిచి భారత కీర్తిపతాకాన్ని రెపరెపలాడించారు.

అండర్-19 విభాగంలో 51 కిలోల బరిలో చంద్రిక పూజారి పసిడి పంచ్ విసిరింది. ఫైనల్లో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన నజోకత్ మార్డోనోవాను 5-0 ఏకగ్రీవ తీర్పుతో ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. 57 కిలోల విభాగంలో ప్రాచి కూడా అదరగొట్టింది. ఇండోనేషియాకు చెందిన దిరా ఆర్టికాపై 5-0తో ఘన విజయం సాధించి భారత్ ఖాతాలో మరో బంగారు పతకాన్ని చేర్చింది.

అండర్-19లో గుంజన్ 45-48 కిలోల విభాగంలో, జోయ్‌శ్రీ 54 కిలోలు, చాహత్ 60 కిలోలు, అన్షిక 75 కిలోలు, మేఘా షియోకండ్ 80 కిలోలు, ప్రాచి టోకాస్ 81 కిలోలకు పైబడిన విభాగంలో రజత పతకాలు సాధించారు.

నిషా పసిడి పంచ్

అండర్-23 విభాగంలో నిషా 54 కిలోల బరిలో స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో జపాన్‌కు చెందిన కొరిన్ కొకోఫును 5-0 ఏకగ్రీవ తీర్పుతో చిత్తు చేసి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. నీతికా చంద్ 60 కిలోలు, కాజల్ 65 కిలోలు, ముస్కాన్ 75 కిలోలు, ప్రియాంక 80 కిలోలకు పైబడిన విభాగంలో రజత పతకాలు గెలుచుకున్నారు.

అండర్-23 విభాగంలో తను 51 కిలోలు, ప్రాచి 57 కిలోలు, శివాని 70 కిలోలు, నైనా 80 కిలోల విభాగాల్లో కాంస్య పతకాలు సాధించారు. దీంతో మహిళల విభాగంలో భారత్ మొత్తం 17 పతకాలతో ఆసియా బాక్సింగ్ వేదికపై తన ఆధిపత్యాన్ని చాటింది.

ఇక పురుషుల పంచ్‌పై చూపు

మహిళా బాక్సర్ల పతకాల పంటతో భారత శిబిరంలో ఉత్సాహం నెలకొనగా.. ఇప్పుడు అందరి దృష్టి పురుషుల ఫైనల్స్‌పై పడింది. అండర్-23 విభాగంలో ముగ్గురు, అండర్-19 విభాగంలో ఇద్దరు భారత బాక్సర్లు స్వర్ణ పతకాల కోసం బరిలోకి దిగనున్నారు. ఐదుగురూ పసిడి పంచ్ విసిరితే భారత్ పతకాల సంఖ్య మరింత పెరగనుంది.