మోత్కూర్ మార్కెట్ కమిటీ షాపులకు బహిరంగ వేలం
- ఈ నెల 22న వేలం.. అద్దె ప్రాతిపదికన 10 దుకాణాల కేటాయింపు
- 20వ తేదీ వరకు టెండర్ దరఖాస్తుల స్వీకరణ
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట నిర్మించిన 10 వాణిజ్య దుకాణాలను ఏడాది పాటు అద్దె ప్రాతిపదికన కేటాయించేందుకు ఈ నెల 22న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి శివకుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. టెండర్ షెడ్యూల్ ఫారాలు రూ.500 చొప్పున జూలై 15 నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయ పనివేళల్లో మోత్కూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
జూలై 22న ఉదయం 11 గంటలకు ప్రాంతీయ ఉప సంచాలకులు (మార్కెటింగ్), వరంగల్ సమక్షంలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దరఖాస్తుదారులు టెండర్ ఫారంతో పాటు రూ.10 వేల ఈఎండీని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ‘కార్యదర్శి, వ్యవసాయ మార్కెట్ కమిటీ, మోత్కూర్’ పేరిట సమర్పించాలని సూచించారు. ఈఎండీ లేకుండా దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేశారు.
మొత్తం 10 దుకాణాల్లో జనరల్ విభాగానికి నాలుగు, బీసీలకు మూడు, ఎస్సీలకు రెండు, ఎస్టీలకు ఒక దుకాణాన్ని కేటాయించనున్నట్లు తెలిపారు. నియమ నిబంధనలు, ఇతర వివరాల కోసం మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని సంప్రదించాలని, 7330733613, 7330733614 నంబర్ల ద్వారా సమాచారం పొందవచ్చని కార్యదర్శి శివకుమార్ పేర్కొన్నారు.
