AP Tourism | పర్యాటక నెట్‌వర్క్‌కు శ్రీకారం

AP Tourism | పర్యాటక నెట్‌వర్క్‌కు శ్రీకారం

AP Tourism | ఈస్టర్న్‌ ఘాట్స్‌లో ట్రెక్కింగ్‌ జోన్లు
విదేశీ పక్షులు కనువిందు
బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌తో అమరావతి ప్రగతి
రూ.100 కోట్లతో గండికోట అభివృద్ధి
అఖండ గోదావరి ప్రాజెక్టు అజరామరం

AP Tourism | అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రం టూరిజం హబ్‌గా మారబోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రత్యేకంగా రూపొందించిన టూరిజం పాలసీతో అనేక వినూత్న ప్రాజెక్టులను పర్యాటక శాఖ చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో పర్యాటకులను ఆకట్టుకునేలా, విలక్షణంగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఉన్న అనేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి నడుం బిగించింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో పర్యాటక శాఖ కీలకంగా మారేలా సరికొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది.

ఆంధ్రప్రదేశ్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో రెండు మెగా ప్రాజెక్టుల కోసం కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎ.ఎ.ఎల్‌. పద్మావతి తెలిపారు. కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టే పలు ప్రాజెక్టుల వివరాలను ఆమె ఆంధ్రప్రభ ప్రతినిధికి వివరించారు.

నదీజలాలపై విమానంలో ప్రయాణించే అద్భుత పథకం సీప్లేన్‌ పర్యాటక నెట్‌వర్క్‌ అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా పది ప్రాంతాల్లో సీప్లేన్‌ సేవలను ప్రవేశపెట్టేందుకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏరోడ్రోమ్స్‌ నిర్మాణాలు చేయాల్సి ఉందని, ఇప్పటికే అనేక సంస్థలు వీటి ఏర్పాటుకు ముందుకువచ్చాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం విజయవాడలో నదిపై విమానయానం ప్రయోగాత్మకంగా సీప్లేన్‌లో ప్రయాణించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. శ్రీశైలం, విజయవాడ, గండికోట, కాకినాడ, అరకు, తిరుపతి తదితర ప్రాంతాలను ఎంపిక చేశామన్నారు. ప్రస్తుతం పర్యాటకుల భద్రత, సాంకేతిక కారణాలు తదితర అంశాల వల్ల కొంతమేర జాప్యం జరుగుతోందన్నారు. వీటికోసం ప్రత్యేకంగా జెట్టీలను కూడా నిర్మించాల్సి ఉంటుందని ఆమె చెప్పారు.

కేంద్రం రెండు భారీ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిందని ఈడీ పద్మావతి తెలిపారు. ఇందులో ఒకటి ఈస్టర్న్‌ ఘాట్ల అభివృద్ధి కాగా, మరొకటి ట్రెక్కింగ్‌ రూట్లకు సంబంధించినదని చెప్పారు. యువతను పర్యాటకం వైపు మొగ్గు చూపే విధంగా వినూత్నంగా ట్రెక్కింగ్‌ జోన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకోసం అరకులోయ, పాడేరు, లంబసింగి ప్రాంతాలను ఎంపిక చేశామని తెలిపారు. యువత ట్రెక్కింగ్‌ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 98 కిలోమీటర్ల మేర సాగే ఈ ట్రెక్కింగ్‌లో మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకునేందుకు అనువుగా హోమ్‌ స్టేలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. త్వరలోనే ఈ రూట్లకు సంబంధించిన పనులను పూర్తిచేసి పర్యాటకులకు సరికొత్త అనుభూతి పంచేలా చర్యలు చేపడుతున్నామని ఆమె వివరించారు.

విదేశీ పక్షులు కనువిందు

పులికాట్‌ అనగానే విదేశీ పక్షులు విడిది చేసేందుకు చేరే ప్రాంతంగా ప్రపంచ పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తోందని పద్మావతి తెలిపారు. పులికాట్‌ సరస్సు వద్ద బర్డ్‌ వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేసి, ఓవైపు సరస్సు సొబగులతో పాటు దేశ విదేశాల నుంచి వచ్చే వందలాది రకాల పక్షులను దగ్గరగా చూసే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లు ఆమె వివరించారు. ఇది అభివృద్ధి చేస్తే పులికాట్‌ సరస్సుకు మరింత ప్రాచుర్యం వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌తో అమరావతి ప్రగతి

అమరావతి కేంద్రంగా పర్యాటక శాఖ నూతనంగా బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అమరావతి బౌద్ధ క్షేత్రంగా చరిత్రలో వెలుగొందడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ ప్రేమికులను ఆకట్టుకునేలా బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. ముఖ్యంగా బౌద్ధ భిక్షువులు, పర్యాటకులు ప్రత్యేకంగా మెడిటేషన్‌ చేసుకునేందుకు వీలుగా మెడిటేషన్‌ సెంటర్‌, థీమ్‌ పార్క్‌, ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌, వాటర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ పనులను పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేస్తామని ఆమె వివరించారు. ఇది పూర్తయితే అమరావతికి మరింత ఉజ్వల ప్రగతి వస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని పద్మావతి అభిప్రాయపడ్డారు.

రూ.100 కోట్లతో గండికోట అభివృద్ధి

కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.100 కోట్లతో గండికోటను అభివృద్ధి చేసినట్లు పద్మావతి చెప్పారు. ఒకప్పుడు గండికోట అంటే ఎవరికీ తెలియదని, కానీ ఇప్పుడు అక్కడ అనేక సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో పర్యాటకుల రద్దీ విపరీతంగా పెరిగిందన్నారు. ఇక్కడ ఫుడ్‌ స్టాల్స్‌, పారా సైక్లింగ్‌ వంటి అనేక వినోదాలను కూడా అమలు చేయడంతో టూరిస్టులు ఈ ప్రాంతానికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. అదేవిధంగా సూర్యలంక బీచ్‌లో సకల సౌకర్యాలు కల్పించడంతో రోజురోజుకు సందర్శకుల సంఖ్య పెరుగుతోందని ఆమె వివరించారు. ఇక్కడ సైక్లింగ్‌తో పాటు హౌసింగ్‌ బోట్లను అందుబాటులో ఉంచడంతో పర్యాటకులు విడిది చేసేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు.

అఖండ గోదావరి ప్రాజెక్టు అజరామరం

రాష్ట్ర చరిత్రలో అఖండ గోదావరి ప్రాజెక్టు అజరామరంగా నిలిచిపోయేలా రూపొందిస్తున్నామని పద్మావతి తెలిపారు. రాజమహేంద్రవరంలోని గోదావరి తీర ప్రాంతాలను అభివృద్ధి చేసేలా రూ.95 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టామన్నారు. చారిత్రక హేవ్‌లాక్‌ బ్రిడ్జిని టూరిస్ట్‌ కేంద్రంగా చేస్తామన్నారు. అలాగే 1.2 కిలోమీటర్ల పొడవున వాక్‌వే ఏర్పాటు, కేఫ్‌లు, ఆర్ట్‌ ఇన్‌స్టాలేషన్లు, థీమ్‌ జోన్లు, హెరిటేజ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటుతో గోదావరి ప్రాంతాన్ని ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేలా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశామన్నారు.

Leave a Reply