FIFA World Cup • Semifinal II | మెస్సీ వర్సెస్ త్రీ లయన్స్.. ఫైనల్ బెర్త్ కోసం మహా సమరం!

  • ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్–అర్జెంటీనా ఢీ
  • భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు మ్యాచ్
  • గెలిచిన జట్టుకు ఫైనల్లో స్పెయిన్‌తో పోరు

ఆంధ్రప్రభ : ఫిఫా ప్రపంచకప్–2026లో మరో బ్లాక్‌బస్టర్ పోరుకు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, ఇంగ్లండ్ జట్లు రెండో సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. అమెరికాలోని అట్లాంటా స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం జూలై 16 గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు ప్రారంభం కానుంది.

తొలిసారి ఇంగ్లండ్‌తో మెస్సీ పోరు!

ఈ మ్యాచ్‌కు మరో ప్రత్యేకత ఉంది. అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ తన సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో తొలిసారి ఇంగ్లండ్ సీనియర్ జట్టుతో తలపడనున్నాడు. ఇరు జట్లు చివరిసారిగా 2005 నవంబర్‌లో తలపడగా.. ఆ మ్యాచ్‌లో మెస్సీ ఆడలేదు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ప్రపంచకప్ సెమీఫైనల్ వేదికగా ఈ పాత ప్రత్యర్థులు మరోసారి ఎదురెదురుగా నిలుస్తున్నాయి.

39 ఏళ్ల వయసులోనూ మెస్సీ మ్యాజిక్..

ఈ ప్రపంచకప్‌లో మెస్సీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే ఎనిమిది గోల్స్, రెండు అసిస్టులతో గోల్డెన్ బూట్ రేసులో ముందున్నాడు మెస్సీ. 39 ఏళ్ల వయసులోనూ అర్జెంటీనా ఎటాక్ ల‌కు అతడే ప్రధాన కేంద్రంగా నిలుస్తున్నాడు. క్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్‌పై అర్జెంటీనా అదనపు సమయంలో 3–1తో విజయం సాధించి సెమీస్‌కు చేరింది.

ఇంగ్లండ్‌కు బెల్లింగ్‌హామ్ హీరో..

మరోవైపు ఇంగ్లండ్ ఆశలు జూడ్ బెల్లింగ్‌హామ్, హ్యారీ కేన్‌పైనే ఉన్నాయి. నార్వేతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో బెల్లింగ్‌హామ్ రెండు గోల్స్ చేసి ఇంగ్లండ్‌ను 2–1తో గెలిపించాడు. అదనపు సమయం వరకు సాగిన ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంది. ఈ టోర్నీలో బెల్లింగ్‌హామ్, కేన్ చెరో ఆరు గోల్స్‌తో మెస్సీకి గోల్డెన్ బూట్ రేసులో సవాల్ విసురుతున్నారు.

‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ నుంచి నేటి సెమీస్ వరకు..

ఇంగ్లండ్–అర్జెంటీనా పోరు అంటే ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే ఓ ప్రత్యేక అధ్యాయం. 1966 ప్రపంచకప్‌లో వివాదాస్పద క్వార్టర్ ఫైనల్.. 1986లో డియెగో మారడోనా సంచలన ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్.. 1998 ప్రపంచకప్‌లో డేవిడ్ బెక్‌హామ్ ఎర్ర కార్డు ఘటన.. ఇలా ఈ రెండు జట్ల మధ్య పోరు ఎన్నో చిరస్మరణీయ, వివాదాస్పద క్షణాలకు వేదికైంది. అయితే ప్రపంచకప్‌లో సెమీఫైనల్ లేదా ఫైనల్ దశలో ఇంగ్లండ్, అర్జెంటీనా ముఖాముఖి తలపడటం ఇదే తొలిసారి. దీంతో దశాబ్దాల నాటి వైరం మరోసారి ప్రపంచకప్ వేదికపై రగులుతోంది.

భారత్‌లో మ్యాచ్ ఎక్కడ చూడాలంటే..

భారత ఫుట్‌బాల్ అభిమానులు ఈ మ్యాచ్‌ను డీడీ స్పోర్ట్స్‌లో ఉచితంగా వీక్షించవచ్చు. జీ5లో ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉండగా, యునైట్8 స్పోర్ట్స్ ఛానళ్లలోనూ మ్యాచ్ ప్రసారం కానుంది. డీడీ ఫ్రీ డిష్ వినియోగదారులు డీడీ స్పోర్ట్స్ ద్వారా ఉచితంగా మ్యాచ్ చూడవచ్చని భారత ప్రసార వివరాలు పేర్కొంటున్నాయి.

ఈ సెమీఫైనల్లో గెలిచిన జట్టు ప్రపంచకప్ ఫైనల్లో ఇప్పటికే ఫ్రాన్స్‌ను 2–0తో ఓడించి టైటిల్ పోరుకు చేరిన స్పెయిన్‌తో తలపడనుంది. దీంతో మెస్సీ అర్జెంటీనాను మరో ప్రపంచకప్ ఫైనల్‌కు తీసుకెళ్తాడా?.. లేక బెల్లింగ్‌హామ్, కేన్ కలిసి ఇంగ్లండ్ ను.. 1966 తర్వాత తొలిసారి ఫైనల్‌కు చేర్చుతారా? అన్నదే ఇప్పుడు ప్రపంచ ఫుట్‌బాల్‌లో అతిపెద్ద చర్చగా మారింది.