Kudankulam | హ్యాకర్ల చేతిలో అణు రహస్యాలు..
- 14.3 గిగాబైట్ల డేటా లీక్..
- కుదంకుళం రహస్య ఫైళ్లు లీక్!
- డార్క్ వెబ్‌లో 19 వేల సున్నిత పత్రాలు
- సాంకేతిక నమూనాలు బయటపడ్డాయంటూ నివేదిక
- రిలయన్స్ సర్వర్‌పై సైబర్ దాడి…
- రంగంలోకి అణు విద్యుత్ సంస్థ, సైబర్ అత్యవసర బృందం…
భారతదేశంలోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రాలలో ఒకటైన కుడంకుళంకు సంబంధించిన కీలక ఫైళ్లు సైబర్ దాడిలో లీక్ అయ్యాయని ఒక సంచలనాత్మక నివేదిక వెలువడింది. సాంకేతిక డిజైన్లు, సరఫరాదారుల వివరాలతో సహా వేలాది సున్నితమైన ఫైళ్లు డార్క్ వెబ్‌లో ప్రత్యక్షమైనట్టు రాయిటర్స్ నివేదిక వెల్లడించింది.
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తమిళనాడులోని కుదంకుళం అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించిన వేలాది సున్నితమైన ఫైల్స్ డేటా చోరీలో బయటపడినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. ‘వరల్డ్ లీక్స్’ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ర్యాన్సమ్వేర్ ముఠా ఈ పత్రాలను డార్క్ వెబ్‌లో లీక్ చేసినట్టు నివేదిక పేర్కొంది.
ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ నుంచి భారీ మొత్తంలో డేటాను దొంగిలించినట్లు హ్యాకర్లు ప్రకటించారు. ఈ ముఠా మొత్తం సుమారు 8.58 లక్షల ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు… వీటిలో కుడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన సుమారు 19,000 సెన్సిటివ్ ఫైల్స్ ఉన్నాయని రాయిటర్స్ కథనం పేర్కొంది. లీక్ అయిన ఈ సెన్సిటివ్ డేటా సుమారు 14.3 గిగాబైట్లు ఉంటుందని పేర్కొంది.
లీకైన అణు కేంద్రం సాంకేతిక నమూనాలు..?
లీకైన ఫైళ్లలో కుడంకుళం అణు విద్యుత్ కేంద్రంలోని కొన్ని మౌలిక సదుపాయాలకు సంబంధించిన సాంకేతిక నమూనాలు, సరఫరాదారుల వివరాలు, సమావేశాల రికార్డులు, తనిఖీ నివేదికలు, పరికరాల మూల్యాంకన పత్రాలు, బీమా పత్రాలు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా నిర్మాణంలో ఉన్న 3, 4 యూనిట్లకు సంబంధించిన కొన్ని పత్రాలు ఇందులో ఉన్నట్లు రాయిటర్స్ పేర్కొంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ పత్రాలు అణు రియాక్టర్ల ప్రధాన వ్యవస్థలకు సంబంధించినవిగా కనిపించడం లేదని నివేదిక పేర్కొంది. రష్యాకు చెందిన రోసాటమ్ సరఫరా చేసిన ప్రధాన రియాక్టర్ వ్యవస్థల సమాచారం లీకైనట్లు ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. అయితే శీతలీకరణ, సహాయక మౌలిక వ్యవస్థలు, నియంత్రణ గది అమరికలకు సంబంధించిన సమాచారం బయటపడితే భద్రతాపరమైన ఆందోళనలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రిలయన్స్ ఏం చెప్పిందంటే..
రిలయన్స్ గ్రూప్ తమకు సంబంధించిన కొంత సమాచారం సైబర్ దాడిలో ప్రభావితమైన విషయాన్ని అంగీకరించినట్లు రాయిటర్స్ తెలిపింది. భారతీయ థర్డ్-పార్టీ డేటా సెంటర్ అయిన యోటా నిర్వహిస్తున్న సర్వర్లలో నిల్వ ఉన్న డేటాపై ఈ ప్రభావం పడిందని ఆ సంస్థ తెలిపింది. అయితే ఏయే పత్రాలు బయటకు వెళ్లాయనే పూర్తి వివరాలను రిలయన్స్ వెల్లడించలేదు. యోటా మాత్రం 2026 మేలో అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించి నిలువరించినట్లు తెలిపిందని రాయిటర్స్ పేర్కొంది.
ఈ వ్యవహారం తీవ్రతను తెలుసుకునేందుకు Nuclear Power Corporation of India Limited అధికారులు రిలయన్స్ గ్రూప్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. భారత కంప్యూటర్ అత్యవసర స్పందన బృందం కూడా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు రాయిటర్స్ నివేదిక వెల్లడించింది.
కుదంకుళం అణు విద్యుత్ కేంద్రం సైబర్ భద్రతపై ఆందోళనలు రావడం ఇదే తొలిసారి కాదు. 2019లో కూడా అక్కడి పరిపాలనా నెట్‌వర్క్‌లో మాల్వేర్ గుర్తించిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. అప్పట్లో అణు విద్యుత్ కేంద్ర నియంత్రణ వ్యవస్థ స్వతంత్ర నెట్‌వర్క్‌లో ఉంటుందని, ఇంటర్నెట్తో అనుసంధానం ఉండదని అధికారులు పేర్కొన్నారు.
