ఈ20పై గడ్కరీ ఇచ్చిన‌ మరో ఆప్షన్ ఇదే!

  • వాహనదారులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
  • ఈ20తో ఇంజిన్లు దెబ్బతింటాయన్న ప్రచారం తప్పుదోవ పట్టించేదేనని స్పష్టీకరణ
  • మైలేజీలో స్వల్ప తగ్గుదల ఉండొచ్చని అంగీకారం

ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా ఈ20 ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌పై వాహనదారుల్లో చర్చ కొనసాగుతున్న వేళ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇథనాల్ కలిపిన ఈ20 పెట్రోల్ వినియోగించడానికి ఇష్టపడని వారు నూటికి నూరు శాతం పెట్రోల్‌ను ఎంచుకోవచ్చని, అయితే దానికి ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.

ఓ ఇంటర్వ్యూలో ఈ20 ఇంధనంపై వస్తున్న విమర్శలకు గడ్కరీ స్పందించారు. దేశం ఇప్పటికే 20 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని సాధించిందని, ఈ20 ఇంధనం విస్తృతంగా అందుబాటులో ఉందని ఆయ‌న‌ పేర్కొన్నారు. అయితే, ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వద్దనుకునే వారికి స్వచ్ఛమైన పెట్రోల్ ఎంపిక ఉండొచ్చని, అయితే దాని ధర అధికంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. వేర్వేరు ఇథనాల్ మిశ్రమాలతో కూడిన పెట్రోల్‌ను బంకుల్లో అందుబాటులో ఉంచాలా వ‌ద్దా అనేది.. పెట్రోలియం శాఖ పరిధిలోనిదని చెప్పారు.

ఇంజిన్లు పాడవుతాయన్నది తప్పుడు ప్రచారం..

ఈ20 పెట్రోల్ కార‌ణంగా వాహనాల ఇంజిన్లు దెబ్బతింటాయన్న ప్రచారాన్ని గడ్కరీ తోసిపుచ్చారు. ఈ10 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వాహనాలు ఈ20 ఇంధనాన్ని వినియోగించగలవని ఆయన పేర్కొన్నారు. ఈ20 కారణంగా ఇంజిన్ దెబ్బతిన్నట్లు ఇప్పటివరకు ప్రభుత్వం వద్ద ఫిర్యాదులు లేవని చెప్పారు. ఇంజిన్ నష్టంపై జరుగుతున్న ప్రచారం తప్పుదోవ పట్టించేదని ఆయన తేల్చి చెప్పారు.

మైలేజీపై స్వల్ప ప్రభావం ఉండొచ్చు..

అయితే ఈ20 ఇంధనంతో మైలేజీపై స్వల్ప ప్రభావం ఉండే అవకాశాన్ని గడ్కరీ అంగీకరించారు. పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌కు ఉష్ణ శక్తి విలువ తక్కువగా ఉండటంతో ఇంధన సామర్థ్యంలో కొంత తగ్గుదల కనిపించవచ్చని వివరించారు. నగరాల్లో రద్దీ మధ్య వాహనాలు నడిపేటప్పుడు పెద్దగా తేడా కనిపించకపోవచ్చని, అధిక వేగంతో రహదారులపై ప్రయాణించే సమయంలో స్వల్ప మైలేజీ తగ్గుదల ఉండొచ్చని చెప్పారు.

చమురు దిగుమతులు తగ్గుతాయి.. రైతులకు మేలు

అయితే, ఇథనాల్ ఉత్పత్తి కార‌ణంగా విదేశీ ముడిచమురుపై భారత్ ఆధారపడటం క్ర‌మంగా తగ్గుతుందని గడ్కరీ తెలిపారు. చెరకు మాత్రమే కాకుండా మొక్కజొన్న, బియ్యం, వరి గడ్డి, వెదురు వంటి ముడి పదార్థాల నుంచి కూడా ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నట్లు ఆయ‌న వెల్ల‌డించారు. రైతులకు మెరుగైన ధరలు లభించడంతో పాటు దేశ ఇంధన భద్రతకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారిక వివరణ ప్రకారం, ఇథనాల్ కొనుగోలు ధరలు రైతులకు గిట్టుబాటు కల్పించే విధంగా నిర్ణయిస్తున్నట్లు తెలిపింది.

ఇక ఈ20 నుంచి ఈ100 వరకు వివిధ ఇథనాల్–పెట్రోల్ మిశ్రమాలతో నడిచే ఫ్లెక్స్ ఇంధన వాహనాల వినియోగాన్ని కూడా కేంద్రం ప్రోత్సహిస్తోంది. 2026 జూన్‌లో భారత్‌లో తొలి ఫ్లెక్స్ ఇంధన ప్రయాణికుల వాహనాన్ని ప్రారంభించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.