చేనేత రంగానికి ‘సహకార’ ఊతం!
- నల్గొండ, యాదాద్రి జిల్లాలతో తొలి విడత క్లస్టర్ ప్రణాళికలు
- చేనేత సంఘాల చైర్మన్లు, డైరెక్టర్లకు ప్రత్యేక శిక్షణ, అవగాహన పర్యటనలు
- ముడిసరుకుల కొనుగోలుకు నాబార్డ్ గ్రాంట్లు.. ఎన్సీడీసీ ద్వారా సబ్సిడీలు
- ఉన్నత స్థాయి సమీక్షలో వ్యవసాయ, సహకార శాఖ ప్రధాన కార్యదర్శి సురేంద్ర మోహన్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో చేనేత సహకార సంఘాల బలోపేతానికి, చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా బుధవారం తెలంగాణ సచివాలయంలో వ్యవసాయ, సహకార శాఖ ప్రధాన కార్యదర్శి సురేంద్ర మోహన్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్సీడీసీ, నాబార్డ్, టెస్కాబ్, చేనేత, జౌళి శాఖ, సహకార శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన చేనేత సహకార సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తొలి దశలో నల్గొండ – యాదాద్రి క్లస్టర్
చేనేత రంగాన్ని ఆధునీకరించేందుకు మొదటి దశలో నల్గొండ – యాదాద్రి భువనగిరి జిల్లాలను ఒక క్లస్టర్‌గా తీసుకొని ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయాలని ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం అయ్యాక, దీని ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రణాళికలను విస్తరిస్తామని ఆయన తెలిపారు. అలాగే, ప్రతి నెలా ప్రగతిపై ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
శిక్షణ.. అవగాహన పర్యటనలు
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన చేనేత సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్ల పనితీరును మరింత మెరుగుపరచడానికి వారికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలతో పాటు, ఇతర ప్రాంతాల్లోని విజయవంతమైన మోడల్స్ పరిశీలించేందుకు అవగాహన పర్యటనలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
నాబార్డ్, ఎన్సీడీసీ ద్వారా ఆర్థిక చేయూత
చేనేత కార్మికులకు పెద్ద ఉపశమనం కలిగిస్తూ.. ముడి నూలు, రంగులు, రసాయనాల కొనుగోలుకు నాబార్డ్ ద్వారా గ్రాంట్లు అందించే అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తున్నట్లు సమావేశంలో వెల్లడించారు. దీనితో పాటు ఎన్సీడీసీ ద్వారా లభించే సబ్సిడీలు, అభివృద్ధి పథకాలను సంఘాలకు చేరవేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి కొత్తగా ముద్ర రుణాలు అందేలా బ్యాంకులతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వానికి ప్రతినిధుల కృతజ్ఞతలు
చేనేత రంగంపై ప్రత్యేక దృష్టి సారించినందుకు గాను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు, ప్రధాన కార్యదర్శి సురేంద్ర మోహన్ కు చేనేత సంఘాల ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశంలో డీసీసీబీ మాజీ డైరెక్టర్, నేలపట్ల చేనేత సహకార సంఘం అధ్యక్షులు పిల్లలమర్రి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కోడం రాములు, డైరెక్టర్ గుర్రం గోవర్ధన్, సలహాదారు తడక వెంకటేష్, గుర్రం వేణు, అలీ శేఖర్, ఎస్. లింగోటం చేనేత సంఘం అధ్యక్షులు తడక నరసింహ, జనంపల్లి చేనేత సంఘం అధ్యక్షులు వనం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
