5thAprilchintana | క్షీరసాగర మథనం ద్వారా ఆధ్యాత్మిక సందేశం..

5thAprilchintana | క్షీరసాగర మథనం ద్వారా ఆధ్యాత్మిక సందేశం..
5thAprilchintana | పాలకడలి మరియు పరిశుద్ధమైన మనసు భావం
మనస్సాగర మథనానికి జ్ఞానం మరియు బుద్ధి అవసరం
గురువు పాత్ర మరియు వివేకం ప్రాముఖ్యత
ఆకర్షణలు, ప్రలోభాలు మరియు మోక్ష సాధన
కార్యసాధకులకు క్షీరసాగర మథనం ఇచ్చే గొప్ప సందేశం
5thAprilchintana | పాలకడలిలో శ్రీహరి పవళించి ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. పాలు స్వచ్ఛతకు, శుద్ధతకు, పవిత్రతకు, పరిపూర్ణతకు ప్రతిరూపాలు. అంటే పరిశుద్ధమైన అంతరంగమే పాలకడలి. మనో మాలిన్యాలను కడిగివేసుకొని, నిర్మలమైన మనసును కలిగి ఉంటే, ఆ మనసును దైవం తన కోవెలగా చేసుకొంటుంది. మనకు క్షార జలధులు (ఉప్పునీటి సముద్రాలు) తెలుసు కానీ క్షీరజలధులు (పాల సముద్రములు) తెలియవు. ఉప్పునీటి సముద్రాన్ని పాల సముద్రంగా మార్చాలంటే చాలా పెద్ద ప్రయత్నం చేయాలి. అది కష్టం. మన మనస్సనే క్షార జలధిని క్షీరజలధిగా చేసుకోగలగడం కేవలం జ్ఞానం పొందడం ద్వారానే సాధ్యం. మనసనే పాలసముద్రాన్ని మథించడానికి (చిలకడానికి) మంధర పర్వతమనే నిశ్చలమైన బుద్ధిని కవ్వంగా చేసుకోవాలి.
మనసు చాలా చంచలమైనది కదా! దానిని కుదురుగా నిలపడానికి గురువు అనే కూర్మాన్ని (తాబేలు) శరణువేడాలి. మనలోని దైవీ గుణాలు, ఆసురీ గుణాలను కూడా తమ వైపు త్రిప్పుకొని, వాసుకి అనే వివేకరజ్జువుతో (తాడుతో) ముక్తి అనే అమృతం కోసం నిరంతర సాధన కొనసాగించాలి. ఆ సాధనలో సాధకుని ప్రలోభ పెట్టడానికి కామధేనువు, కల్పవృక్షము, ఐరావతంవంటి ఆకర్షణలు (సిద్ధులు) ఉదయిస్తాయి. వాటికి ఆశపడితే మోక్షసుధ లభించదు. కనుక వాటిని భగవదర్పణం చేస్తూ, మనస్సాగర మథనము కొనసాగిస్తే మొదట సత్వగుణం, దాని వలన జ్ఞానం, దానివల్ల మోక్షం సిద్ధిస్తుంది అంటారు పెద్దలు. ఆసురీ ప్రకృతిగలవారికి మోక్షామృతం ప్రాప్తించదు. దైవీప్రకృతి కలవారికే అది సిద్ధిస్తుంది.

ఈ ప్రయత్నంలో మందరపర్వతం అనే బుద్ధి, పాలు అనే భ్రమలో మునిగిపోయే ప్రమాదం ఉంది. ఆ సమయంలో గురువు అనే విష్ణువును ఆశ్రయిస్తే ఆయన మన బుద్ధి మునిగిపోకుండా కాపాడుతూంటాడు. తాబేలు యొక్క పై డిప్ప ఎంత కఠినమో దాని శరీరం అంత మృదువు. శిష్యుల మనోబుద్ధులను క్రమశిక్షణలో పెట్టే క్రమంలో గురువు కఠినంగా ప్రవర్తించినా ఆయన హృదయం మాత్రం ‘శిష్య వాత్సల్యం’ అనే మృదువైన లక్షణాన్ని కల్గి ఉంటుంది. ఈ క్షీరసాగర మథనం కథ కేవలం ముముక్షువులకే కాదు. కార్య సాధకులందరికీ గొప్ప సందేశాన్నిచ్చే గాధ. కార్య సాధకులు ఎప్పుడూ తమ లక్ష్య సాధనలో ఆకర్షణలకు లొంగరు. భయపెడితే బెదరరు. దేవతలు పాల కడలిలో పుట్టిన రత్నాలకై వెంపర్లాడలేదు. భయంకరమైన హాలాహలాన్ని చూచి వెనుకంజ వేయలేదు. అమృతాన్ని సాధించే వరకూ తమ ప్రయత్నాన్ని వదలలేదు. కార్యసాధకుల లక్షణం అలా ఉండాలి.
- డా.గొల్లాపిన్ని సీతారామశాస్త్రి

