No Vehicle Day | ఇంధన పొదుపే లక్ష్యం
No Vehicle Day | ఇంధన పొదుపే లక్ష్యం
No Vehicle Day | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సైకిల్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సైకిల్ ర్యాలీలో పాల్గొన్న ఆమె, ప్రజల్లో పర్యావరణ చైతన్యం పెంపొందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు.
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని అనిత అన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఒక్క రోజు ‘నో వెహికిల్ డే’ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. వాహనాల వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఇంధన పొదుపుతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని కూడా నియంత్రించవచ్చని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గాల్లో నిర్వహించే పార్టీ కార్యక్రమాలకు కూడా సైకిళ్లను వినియోగించాలని నిర్ణయించినట్లు హోంమంత్రి వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, సైకిల్ వినియోగాన్ని జీవనశైలిలో భాగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
