కర్నూలులో పోలీసుల హైఅలర్ట్

కర్నూలులో పోలీసుల హైఅలర్ట్
జిల్లా వ్యాప్తంగా విస్తృత సోదాలు
బస్సుల్లో ముమ్మర తనిఖీలు
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ విక్రాంత్ పాటిల్ (Vikrant Patil) ఆదేశాల మేరకు జిల్లాలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. డిల్లీ ఘటన నేపథ్యంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించి, జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా ప్రైవేట్, ఆర్టీసీ ట్రావెలింగ్ బస్సుల్లో, ముఖ్యంగా రాత్రి పూట నడిచే వాహనాల్లో భద్రతా ప్రమాణాల అమలుపై అధికారులు కఠినంగా తనిఖీలు చేపట్టారు. వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవర్ లైసెన్సులు, ఇన్సూరెన్స్ వివరాలు సమగ్రంగా పరిశీలిస్తున్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణ (Prevention of road accidents) దిశగా పోలీసులు ప్రత్యేక కార్యక్రమంగా స్టాప్ – వాష్ అండ్ గో ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో హైదరాబాద్–బెంగుళూరు, హైదరాబాద్–చెన్నై జాతీయ రహదారులు (NH-44, NH-40)లో రాత్రి సమయంలో ప్రయాణించే లారీలు, ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, కార్లు, మినీ వ్యాన్లు, బొలేరో వాహనాలను పోలీసులు ఆపి, డ్రైవర్లకు తాగునీరు అందించి, ముఖం కడిగించి అప్రమత్తంగా ప్రయాణం కొనసాగించాలని సూచిస్తున్నారు.
డ్రైవర్లు (Drivers) వాహనాలు నడిపేటప్పుడు అతి వేగం, రాంగ్ రూట్ ప్రయాణం, అధిక ప్రయాణికులను ఎక్కించుకోవడం వంటి తప్పిదాలను నివారించాలని పోలీసులు హెచ్చరించారు. వాహనం నడిపే సమయంలో తమ కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. భద్రతా ప్రమాణాలు పాటించని, నియమాలు ఉల్లంఘించే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు.
