అదనపు తరగతి గదుల నిర్మాణంలో నాణ్యత పాటించాలి

  • కేజీబీవీలో భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఉట్నూర్, ఆంధ్రప్రభ: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శుక్రవారం సాయంత్రం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థినులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం విద్యా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని కాంట్రాక్టర్‌కు సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. విద్యాభివృద్ధే సమాజాభివృద్ధికి పునాది అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీసీసీ ఉపాధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య, జైనూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బానోత్ జైవంతరావు, ఉట్నూర్ సర్పంచ్ అనిత శ్రీనివాస్ జాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు డాక్టర్ దాసండ్ల ప్రభాకర్, పట్టణ అధ్యక్షుడు సయ్యద్ నిసార్, సహకార సంఘం చైర్మన్ సామ ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్తపల్లి మహేందర్, కైసర్, కేజీబీవీ ఎస్‌వో, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.