ప్రమాదం జరిగితే.. బాధ్యులు ఎవరు..?
ఖానాపూర్ టౌన్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో రక్షణ కంచెలు లేకుండా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రధాన రహదారులతో పాటు జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ ఎలాంటి భద్రతా చర్యలు లేకుండా ట్రాన్స్ఫార్మర్లను వదిలేయడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఖానాపూర్–నిర్మల్ జాతీయ రహదారిపై విద్యుత్ సబ్స్టేషన్ ఎదురుగా ఉన్న ట్రాన్స్ఫార్మర్కు రక్షణ కంచె లేకపోవడంతో పాటు చెట్లు పెరిగి విద్యుత్ వైర్లు రహదారిపైకి వాలే పరిస్థితి నెలకొంది. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే పాదచారులు, వాహనదారులు ప్రమాదం ఎప్పుడు జరుగుతుందోనని భయపడుతున్నారు.
కెనరా బ్యాంకు ఎదురుగా ప్రధాన రహదారి పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఉండటం, దానికి ఎలాంటి రక్షణ లేకపోవడం విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇదే పరిస్థితి విద్యానగర్, శాంతినగర్ ప్రాంతాల్లోని పలు ట్రాన్స్ఫార్మర్ల వద్ద కూడా కనిపిస్తోందని చెబుతున్నారు.
ఈ రహదారిపై జగిత్యాల, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ తదితర జిల్లాలకు నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇలాంటి ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ కంచెలు లేకపోవడం ప్రమాదకరమని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే, ముందస్తుగా ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ కంచెలు ఏర్పాటు చేసి, చెట్ల కొమ్మలను తొలగించి భద్రతా చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు, వాహనదారులు విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నారు.
