America Iran Conflict | ఇరాన్ క్షిపణి స్థావరాలపై అమెరికా దాడులు

America Iran Conflict | ఇరాన్ క్షిపణి స్థావరాలపై అమెరికా దాడులు
America Iran Conflict | డ్రోన్‌ను కూల్చివేసిన ఇరాన్ ప్రతిస్పందన
ఖమేనీ సంచలన హెచ్చరికలు
దౌత్య చర్చల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు
America Iran Conflict | టెహరాన్/న్యూయార్క్: చాలా కాలం పాటు స్తబ్ధుగా ఉన్న అమెరికా సైన్యం తాజాగా ఇరాన్‌పై ఒక్కసారిగా విరుచుకుపడింది. ఇరాన్ క్షిపణి స్థావరాలతో పాటు వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధిలో మందుపాతరలు అమర్చడానికి ప్రయత్నిస్తున్న ఇరాన్ నౌకలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం తాజా సైనిక దాడులు నిర్వహించింది.
ఇరాన్ దళాల నుండి ఎదురయ్యే ముప్పుల నుండి తమ సైనికులను రక్షించే లక్ష్యంతోనే ఈ ఆపరేషన్‌ను చేపట్టినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) పేర్కొంది. దీనిని రక్షణాత్మక చర్యగా తెలిపింది. సెంట్కామ్ ప్రతినిధి టీమ్ హాకిన్స్ ప్రకారం కాల్పుల విరమణ అమల్లో ఉన్నంత కాలం ఈ దాడులు సంయమనంతో జరిగాయి.
దక్షిణాన ఉన్న ఒక కీలక ఓడరేవు నగరం, ఇరాన్ నావికాదళ స్థావరమైన బందర్ అబ్బాస్ సమీపంలో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్డ్స్ (ఐఆర్జీసీ) ఒక అమెరికా డ్రోన్‌ను కూల్చివేసినట్లు, గగనతలంలోకి ప్రవేశించిన ఒక ఫైటర్ జెట్, డ్రోన్‌పై కాల్పులు జరిపింది. అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, అందువల్ల దీనిపై ప్రతీకారం తీర్చుకోవడానికి తమకు చట్టబద్ధమైన, నిశ్చయమైన హక్కు ఉందని ఇరాన్ నొక్కిచెప్పింది.
గడియారాన్ని వెనక్కు తిప్పలేము
వార్షిక హజ్ యాత్ర సందర్భంగా తన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన వ్యాఖ్యలలో ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా మొజబా ఖమేనీ గడియారాన్ని వెనక్కు తిప్పలేమని, ఈ ప్రాంతంలోని దేశాలు, భూభాగాలు ఇకపై అమెరికన్ స్థావరాలకు రక్షణ కవచంగా ఉండవని అన్నారు. ఇకపై “అమెరికాకు మరణం, ఇజ్రాయెల్‌కు మరణం” అనే నినాదాలు ఇస్లామిక్ దేశం, ప్రపంచంలోని అణగారిన ప్రజలు, ముఖ్యంగా యువత నినాదాలుగా ఉంటాయని ఆయన అన్నారు.
కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలు
తాజా ఘర్షణలు జరిగినప్పటికీ, విస్తృత ఒప్పందం దిశగా దౌత్యపరమైన పురోగతి సాధించడం సాధ్యమేనని అమెరికా అధికారులు సూచించారు. ఇరాన్ అగ్ర సంధానకర్త మహమ్మద్ బాకర్ ఖలీబాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి, ఖతార్ ప్రధానమంత్రి మధ్య మంగళవారం చర్చలు జరగనున్నట్లు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తెలిపారు.
ముసాయిదా పత్రాలలోని నిర్దిష్ట భాషపై చర్చలు జరుగుతున్నాయని, దీనికి కొన్ని రోజుల సమయం పట్టవచ్చని ఆయన వివరించారు. అంతకు ముందు సోమవారం ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ప్రచురించిన ఒక సుదీర్ఘ పోస్ట్‌లో ఇరాన్ చర్యలు సవ్యంగా సాగుతున్నాయని అన్నారు. కానీ అవి విఫలమైతే కొత్త దాడులు జరుగుతాయని హెచ్చరించారు. “అందరికీ ఒక గొప్ప ఒప్పందం కుదురుతుంది లేదా అసలు ఒప్పందమే ఉండదు” అని ఆయన తెలిపారు.
